చంద్రబాబు శ్రీకాకుళం వెళ్లడం వల్ల పనులు ఆగుతాయే తప్ప జరగవు..!

Sunday, October 14th, 2018, 03:00:18 AM IST

ఇటీవలే వచ్చిన తిత్లి తుఫాను శ్రీకాకుళంలో ఎంతటి భీబత్సాన్ని సృష్టించిందో అందరకి తెలుసు.ఈ విషాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే అప్రమత్తమయ్యి శ్రీకాకుళం జిల్లాలో తిత్లి తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను అధికారుల సమక్షంలో పర్యవేక్షించి అక్కడి ప్రజలకు భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు.ఇప్పటికే అక్కడ నష్టపోయిన ప్రజలకు బియ్యం,కందిపప్పు,నూనె,ఉల్లిపాయలు మరియు ఇతర వంట సరుకులు వెంటనే అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇప్పుడు చంద్రబాబు ప్రజల యొక్క సమస్యలని తెలుసుకుంటున్నా సరే విమర్శల పాలవుతున్నారు.చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం వెళ్లిపోకుండా విశాఖ జిల్లాలో ఉండి అక్కడి నుంచే శ్రీకాకుళంలో వారి అధికార యంత్రాంగంతో పని చెయ్యించాల్సిందని,బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు తెలిపారు.తాను ఈ విధంగా మాట్లాడ్డానికి గల కారణాన్ని కూడా ఆయన తెలిపారు.చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో నేరుగా వెళ్లి పర్యటించడం వల్ల అక్కడి పనులకి ఆటంకం కలుగుతుందే కానీ త్వరగా జరగవని తెలిపారు.ఎందుకంటే బాబు గారు అక్కడ పర్యటించడం వల్ల అక్కడి ఎమ్మెల్యేలు,కలెక్టర్లు మరియు ఇతర అధికార యంత్రాంగం ఆయన చుట్టూనే తిరుగుతారని,దానివల్ల సమూహాలుగా చేసే పనులు ఒక దగ్గరకే వచ్చి చేరుతాయని,అందువల్ల ఆయన విశాఖలో ఉండి ఇక్కడి అధికారులకు దిశా నిర్దేశం చేస్తే మంచిదని సూచించారు.