బూట్లతో కొట్టుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే !

Thursday, March 7th, 2019, 08:17:38 AM IST


ప్రజానీకానికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే దారి తప్పుతున్నారు. క్షణికావేశంలో మాటల దాడులే కాదు, భౌతిక దాడులు కూడా చేసుకుంటున్నారు. బీజేపీ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ మాట మాట పెరిగి బూట్లతో కొట్టుకుని, పిడి గుద్దులు గుద్దుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నగరమైన లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో గల సంత్ కబీర్ నగర్లో ఈ అవమానకర ఘటన చోటు చేసుకుంది.

నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించేందుకు పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు బీజేపీ నేతలు. దీనికి ఎంపీ శరద్ త్రిపాఠితో పాటు ఎమ్మెల్యే రాకేశ్ బాగెల్ కూడా హాజరయ్యారు. మొత్తం మీడియాతో పాటు ప్రధాన జిల్లా అధికారులు కూడా అక్కడ ఉన్నారు. స్థానికంగా జరుగుతున్న ఒక రోడ్డు ప్రారంభోత్సవ ఫలకం మీద తన పేరు లేదేమంటూ ఎంపీ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దానికి సమాధానంగా అది తన నిర్ణయమేనని ఎమ్మెల్యే రాకేశ్ అన్నారు. దీంతో మాటల యుద్ధం మొదలైంది. ఉన్నట్టుండి సహనం కోల్పోయిన త్రిపాఠి కాలి బూటు తీసి ఎమ్మెల్యేను తీవ్రంగా కొట్టారు. ఎమ్మెల్యే సైతం ఎంపీపై తిరగబడ్డారు. రచ్చ పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. తరవాత ఎంపీ మాట్లాడుతూ ఘటనకు చింతిస్తున్నట్టు తెలిపారు. వారి ప్రవర్తన చూసిన అధికారులు, మీడియా వీళ్ళేం ప్రజాప్రతినిధులు అని ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటనపై బీజేపీ హైకమాండ్ ఇంకా స్పందించాల్సి ఉంది.