సొంత సర్వే ఫలితాలతో ఉలిక్కిపడ్డ బిజెపి నేతలు?

Sunday, June 10th, 2018, 10:39:22 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గత ఎన్నికల్లో అద్భుతవిజయం అందుకున్న ఎన్డీయే నేతృత్వంలోని బిజెపి, అప్పట్లో యుపిఎ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక తరువాత ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసాక పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయన ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేలా స్వచ్ఛ భారత్ వంటి కొన్ని పథకాలతో ప్రజల మదిలోకి బానే వెళ్లిందని చెప్పుకోవాలి. అయితే కాలం మెల్లగా సాగుతుండడం, అప్పుడే వారి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పైబడడంతో రానున్న ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తామో, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో తమకు ఏమేర ప్రాభవం ఉందొ తెలుసుకోవడానికి ఒక సర్వే నిర్వహించిందట. ఆ సర్వేలో బీజేపీ నేతలు నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయట. ఇదివరకు ఎన్నికల్లో 282 స్థానాల్లో మంచి విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిజెపి, రానున్న ఎన్నికల్లో దాదాపు సగం అంటే 140 నుండి 150 మేరకు మాత్రమే సీట్లను పొందగలదనే విధంగా ఫలితాలు వచ్చాయని సమాచారం. అందువల్ల ఈ ఫలితాలు తెలుసుకున్న బీజేపీ అధిష్టానం ఇప్పటినుండే పార్టీ అంతర్గత కార్యకలాపాలపై సుదీర్ఘ దృష్టి కేంద్రీకరించిందని వినికిడి.

ఇటీవల ఢిల్లీలో జరిగిన మూడు నగరపాలక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా యువతకే పెద్ద పీట వేశారని, అందువల్ల వాటిలో విజయం సాధించారని తెలుస్తోంది. కాబట్టి ఈ సారి ఎన్నికల్లో కూడా చాలా వరకు వయసైపోయిన సిట్టింగ్ లను తప్పించి కొత్తగా పార్టీలో చేరిన యువతకే సీట్లు కేటాయించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదివరకు 75ఏళ్ళు పైబడిన నాయకులను ఎన్నికల్లో పోటీచేయకూడదని నిర్ణయించిన ఆ పార్టీ దానికి కొంత సవరణ చేసి కొన్ని ముఖ్య ప్రాంతాల్లో మాత్రం సీనియర్లకు సీట్లు కేటాయించాలని చూస్తోందట. అలానే తమకు పట్టున్న రాష్ట్రాల్లోనే కాక రెండు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా రానున్న ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచేందుకు ఇప్పటినుండే తగిన ప్రణాళికలు రచిస్తోంది, ఎలాగైనా మరొక్కమారు కూడా ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అధికారం లోకి తీసుకొచ్చేవిధంగా అన్ని విధాలా కృషి చేయనున్నట్లు వినికిడి. ఏది ఏమైనప్పటికి జరిగిన ఈ సర్వే ప్రకారం ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ప్రజలు ఒకింత సమస్యలపాలు అవుతున్నట్లు, అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది……