గాలి టికెట్ ను గాల్లో కలిపిన బీజేపీ..!

Thursday, April 12th, 2018, 04:10:41 PM IST

కర్ణాటక ఎన్నికలు అనగానే జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ వ్యక్తి గాలి జనార్దన్‌రెడ్డి. గతంలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు. ఓబులాపురం గనుల్లో అక్రమ మైనింగ్‌తో కోట్లు సంపాదించి సీబీఐ కేసుల్లో చిక్కుకున్నారు. జైలుకు కూడా వెళ్లారు. బెయిల్ కోసం కూడా జడ్జికి లంచం ఇవ్వబోయి దానికి సెపరేటుగా జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈసారి బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా అన్న చర్చ నడిచింది. అయితే ఈ ఎన్నికల్లో గాలికి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని బీజేపీ కర్ణాటక ఎన్నికల ఇన్‌చార్జ్ మురళీధరరావు స్పష్టంచేశారు. అయితే గాలి మాత్రం బీజేపీ బడా నేతలతో కలిసి తిరుగుతూనే ఉన్నారు. కర్ణాటక ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తున్నారు.

దీనిపై మురళీధరరావును ప్రశ్నించగా.. అక్కడ సోమశేఖర్‌రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకే ఈసారి కూడా టికెట్ ఇచ్చాం. ఈ ఇద్దరు రెడ్డీలను మేం ఒకే గాటన కట్టలేం. అలాగే కరుణాకర్‌రెడ్డి పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడు. అందువల్ల ఈ అందరూ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే గాలిని ప్రచారం చేయకుండా ఆపలేం. ప్రచారం అనేది చాలా పెద్ద స్థాయిలో జరిగేది. దానిని నియంత్రించలేం. పార్టీ గెలుపు కోసం కృషి చేసేవాళ్లలో చాలా మంది ఉన్నారు. ఆయన చిన్న వ్యక్తి అని నేను అనడం లేదు. అయితే బీజేపీకి ప్రచారం చేసే ప్రతి వ్యక్తిని నేను నియంత్రించలేను అని మురళీధరరావు అన్నారు.