మాజీ ప్రధానిని టార్గెట్ చేశారు !

Thursday, January 10th, 2019, 01:20:46 PM IST

కర్ణాటకలో నడుస్తున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం బీజేపీ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకోవడమనే పనిని ఇప్పటికే మొదలుపెట్టిన కమలదళం భవిష్యత్తులో ఏకంగా మాజీ ప్రధాని, సంకీర్ణ ప్రభుత్వానికి పెద్దగా వ్యవహరిస్తున్న దేవే గౌడను టార్గెట్ చేసింది. అది కూడ పక్కా ప్లాన్ తో కావడం విశేషం. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తన ప్రస్తుత స్థానం మనవడు హాసన్ కు కేటాయించి బెంగుళూరు ఉత్తర నుండి పోటీకి దిగాలని దేవే గౌడ నిర్ణయించుకున్నారు.

దీంతో బీజేపీ కీలక నేతలతో భేటీలు జరిపి ఉత్తరలో ఆయన్ను ఓడించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం సదానంద గౌడ ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరలో ఈసారి మహిళా నేత తేజస్వి రమేశ్ ను దేవే గౌడపై పోటీకి దింపాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తేజస్వి రమేశ్ కు గతంలో దేవే గౌడను ఓడించిన ట్రాక్ రికార్డ్ ఉంది. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఆమె 15 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అభ్యర్థిగా కనకపుర లోక్ సభ నియోజకవర్గంలో దేవే గౌడపై పోటీచేసి లక్ష ఓట్లతో గెలిచింది. ఈ ధైర్యంతోనే బీజేపీ ఈమెను దేవే గౌడపై పోటీకి దింపుతోంది. ఒకవేళ ఆమె గెలిస్తే రాజకీయ లెక్కలు చాలా వరకు మారిపోతాయని బీజేపీ భావిస్తోంది.