సీట్ల కోసం వైసీపీతో బీజేపీ కుమ్మక్కు అయింది!

Friday, July 27th, 2018, 09:27:15 AM IST

ఏపీకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయమై గత ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్డీయే లోని బీజేపీ అన్నివిధాలా మోసం చేసిందని ఇటీవల ఎన్డీయే నుండి బయటకొచ్చిన టీడీపీ, అంతటితో ఆగకుండా ప్రాంతీయ పార్టీల మద్దతుతో లోక్ సభలో కొద్దిరోజుల క్రితం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో తాము హోదా అంశాన్ని పక్కన పెట్టలేదని, రాష్ట్రానికి జరిగే అన్యాయం, కుట్రపై రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా పోరాడుతాం అని చంద్రబాబు అంటున్నారు. అయితే బీజేపీ కుట్రపూరిత చర్యలవల్లనే మన రాష్ట్రానికి ప్రస్తుతం ఈ స్థితి వచ్చిందని, ఓవైపు మేము రాష్ట్ర అభివృద్ధి, మరియు రాజధాని నిర్మాణానికి అన్నివిధాలా పాటుపడుతుంటే, ఆ పార్టీ నేతలు మాత్రం అవినీతిలో కూరుకుపోయిన వైసిపితో రహస్య పొత్తు పెట్టుకుని, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

మోడీ నిరంకుశ వైఖరి వల్ల రాష్ట్రంలోని చాలా రంగాలు సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, గత ఎన్నికల సమయంలో తిరుపతి, నెల్లూరు, అమరావతిల సాక్షిగా చేసిన హామీలన్నీ కూడా ఆయన తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రానికి ఎన్నో ఇచ్చాము, ఎంతో చేశామని అంటున్నారు. అవన్నీ కూడా పచ్చి అబద్ధాలని, వారు మొదటినుండి మాట్లాడుతున్న మాటలే ఇప్పుడు కూడా చెప్తున్నారని, వారి మాటలకు చేతలకు అసలు ఏమాత్రం పొంతన లేదని అన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా తమ పార్టీ జండా పాతాలని బీజేపీ కుట్ర పన్నుతోందని, కానీ ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారు, మనం చేసే పనులన్నీ వారు గుర్తుపెట్టుకుంటారని, రాబోయే ఎన్నికల్లో మోడీకి, బిజెపికి దేశవ్యాప్తంగా ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఇకనైనా అబద్దపు, బూటకపు వ్యవహారాలు మాని, మా రాష్ట్రానికి న్యాయం చేయాలనీ ఆయన కోరారు….

  •  
  •  
  •  
  •  

Comments