రూ.100 కోట్లు, మంత్రి పదవులతో బిజెపి ఎర : జేడీఎస్ నేత కుమారస్వామి!

Wednesday, May 16th, 2018, 03:10:59 PM IST

నిన్న వెలువడిన కర్ణాటక ఎన్నికల ఫలితాలలో 104 సీట్లతో పేరుకు బిజెపి గెలిచినప్పటికీ ఆ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోయింది. నిజానికి మ్యాజిక్ ఫిగర్ కు కావలసినంత ఎమ్యెల్యేల బలం బిజెపికి దక్కలేదు. మరోవైపు 78 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్, ఫలితాలు పూర్తిగా వెలువడకముందే బిజెపిని తొక్కిపెట్టాలనే ఉద్దేశ్యంతో తాము జేడీఎస్ తో పొత్తుకు సిద్ధమని ఢిల్లీ నుండి అధినేత్రి సోనియా ప్రకటన విడుదల చేశారు. అయితే తాము కూడా కాంగ్రెస్ తో మద్దతుకు రెడీ అని జెడిఎస్ నేతలు కూడా ప్రకటించారు. 38 స్థానాలతో కింగ్ మేకర్ గా నిలిచిన జేడీఎస్ పార్టీ నేడు బెంగళూరులో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ నేతలు కుమార స్వామి గౌడను శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో తన సోదరుడు రేవణ్ణతో కలిసి కుమారస్వామి మాట్లాడుతూ, తమ పార్టీనేతలను బిజెపి వారు దాదాపు రూ.100 కోట్ల మేర డబ్బు, అలానే కొందరికి మంత్రి పదవులు ఎరచూపి తమవైపుకు తిప్పుకునేందుకు చూసారని, వారి ఎత్తులు పారవని, తమ పార్టీ ఎమ్యెల్యేలు అందరూ కలిసికట్టుగా వున్నారని, వారిలో ఎటువంటి చీలిక లేదని అన్నారు. కర్ణాటకలో తమ పార్టీని బిజెపి అణచివేయాలని చూసిందని, మోదీ నియంతృత్వ పాలనకు కాలం చెల్లిందని, అందుకే లౌకికవాదమున్న కాంగ్రెస్ తో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని అన్నారు.

ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి కావలసినంత మంది ఎమ్యెల్యేలు లేకపోయినా ఇక్కడ అధికారం చేపడతాం అని మోడీ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. నిజానికి కాంగ్రెస్ తో పొత్తు ఫలితాల అనంతరమే తాము కుదుర్చుకున్నామని, వారితో పొత్తుకు మేము ఎటువంటి షరతులు పెట్టలేదని, సిద్దరామయ్య నేతృత్వంలోని పార్టీతో నడవడం ఆనందదాయకం అన్నారు. కొందరు తనను ముఖ్యమంత్రి అభ్యర్థి అంటున్నారని, నిజానికి తనకు అధికార దాహం లేదని, ఎవరు ముఖ్యమంత్రి అనేది పార్టీ సభ్యులందరు కలిసి నిర్ణయించాల్సిన విషయం అన్నారు. కేవలం రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ తో చేయి కలుపుతున్నట్లు తెలిపారు…….