చందమామ గురి మొత్తం మన చంద్రులపైనే..ఏం జరుగుతుందో..!!

Wednesday, January 31st, 2018, 01:00:49 AM IST

రేపు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. నిత్యం చల్లని వెన్నెల వెదజల్లే చంద్రమామ సహజంగా కనిపించే సైజు కంటే ఎక్కువగా కనిపించనున్నాడు. వెండి వెలుగుల్లోకనిపించే జాబిలి రేపటి రోజున మాత్రం ఎర్రటి వర్ణంలో దర్శనం ఇవ్వబోతున్నాడు. దీనికి కారణం అత్యంత అరుదుగా సంభవించే చంద్రగ్రహణం. చంద్రగ్రహణాలు తరచుగా ఏర్పడుతుంటాయి. కానీ ఈ చంద్రగ్రహణానికి మాత్రం ప్రత్యేకత ఉంది. అందుకే శాస్త్రవేత్తలు సూపర్ మూన్, బ్లడ్ మూన్ మరియు బ్లూ మూన్ అంటూ పిలిచేస్తున్నారు. చంద్రగ్రహణాన్ని అందరూ వీక్షించకూడదని అరిష్టమని జ్యోతిష్యులు ఎప్పుడూ చబుతూ ఉండేదే. శాస్త్రవేత్తలు మాత్రంఇలాంటివి ఏవి పట్టించుకోవద్దని ఆకాశంలో జరిగే అద్భుతాన్ని అందరూ కళ్లారా వీక్షించవచ్చని భరోసా ఇస్తున్నారు.

జ్యోతిష్యుల ప్రకారం రేపటి రోజున జరగబోయే చంద్రగ్రహణ ప్రభావం మేషం, కర్కాటకం, ధనుస్సు మరియు సింహా రాశుల వారిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందట. అందువలన ఈ రాశులకు చెందిన వారంతా గ్రహణానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరిక మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులకు జారీ చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ మరియు చంద్రబాబు ఇద్దరూ కర్కాటక రాశికి చెందిన వారు కావడం విశేషం. ఈ ఇద్దరు చంద్రులకు కూడా ఇలాంటి విషయాల పట్ల ఆసక్తి ఎక్కువే. ఇద్దరు చంద్రులు వాస్తుప్రకారం కోట్లు వెచ్చించి పకడ్బందీగా క్యాంపు ఆఫీస్ లని నిర్మించుకున్న సంగతి తెలిసిందే. వాడే కార్ల విషయంలో కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాస్తుని ఫాలో అవుతున్నారు. జ్యోతిష్యంపై ఇంత నమ్మకం చూపే చంద్రబాబు, కేసీఆర్ రేపటి చంద్రగ్రహణానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.