కృష్ణా నదిలో బోటు ప్రమాదం.. చెల్లా చెదురైన కుటుంబాలు

Monday, November 13th, 2017, 11:33:48 AM IST

విజయవాడ కృష్ణా నదిలో ఎవరు ఊహించని విధంగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో ఇప్పటికే 12 మంది మృతి చెందారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నదిలో నుంచి మృత దేహాలను బయటకు తీశారు. విహార యాత్ర కోసం భవానీ ఐలాండ్స్ నుంచి పవిత్ర సంగమానికి పర్యాటకులు వెళుతున్న సమయంలో బోటు బోల్తా పడినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకాశం బ్యారేజీని చూసిన తరువాత పవిత్ర సంగమాన్ని చూసేందుకు బోటులో ప్రయత్నిస్తుండగా మార్గమధ్యంలో బోటు బోల్తా పడింది.

విహార యాత్రను విషాద యాత్రగా మార్చిన ఈ బోటు ప్రమాదంలో ఇంకా నలుగురి జాడ దొరకాల్సి ఉంది. బోటు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోటు ప్రమాదం జరిగిన ప్రాంతంలో లోతు కేవలం 10 నుంచి 15 అడుగుల మేర మాత్రమే ఉంటుందని డ్రైవర్ నిర్లక్ష్యం అవగాహన లేకపోవడం వల్ల బోటు ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇక చనిపోయిన వారు అంతా ప్రకాశం జిల్లా వాసులే. ఘటన గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారిలో చంద్రన్న బీమా ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, చంద్రన్న బీమా లేని వారికి 8 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాను ఇస్తామని ఉపముఖ్యమంత్రి చిన రాజప్ప తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments