భూమాకి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే ఆయ‌న వైకాపాలోకి జంప్‌?

Thursday, February 9th, 2017, 11:50:44 PM IST


మంత్రివర్గ విస్తరణ .. ప్ర‌స్తుతం ఏపీని ఊపేస్తున్న మ్యాట‌ర్ ఇది. కొత్త‌వారికి, జంప్ జిలానీల‌కు ఈసారి మంత్రి ప‌ద‌వులు రానున్నాయ‌ని ఓ రేంజులో ప్ర‌చారం సాగుతోంది. ఆశావ‌హులంతా ఎవ‌రికి వారు లాబీయింగ్ కు పాల్ప‌డ‌నున్నారు. అయితే ప‌ద‌వి అందుకునే ప్రాబ‌బుల్స్‌లో జంప్ జిలానీల పేర్లు వినిపిస్తుండ‌డంతో తెలుగు త‌మ్ముళ్లంతా గుర్రుమీద ఉన్నార‌ని తెలుస్తోంది. విస్త‌ర‌ణ‌లో త‌మ‌ను కాద‌ని ఇత‌ర పార్టీ ల‌నుంచి వ‌చ్చి చేరిన వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడితే ఇక పార్టీ మారేందుకు కూడా కొంద‌రు రెడీ అవుతున్నారుట‌.

ముఖ్యంగా కర్నూలులో వైకాపా నుంచి టీడీపీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్ర‌చారం సాగుతోంది. దీంతో సొంత నియోజకవర్గమైన ఆళ్లగడ్డలో భూమా ప్రత్యర్థి గంగుల ప్రభాకరరెడ్డి త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాడ‌ని తెలుస్తోంది. భూమాకి ప‌ద‌వి క‌ట్ట‌బెడితే త‌మ ప‌రిస్థితేంటి? అన్న విష‌యంపై కార్యకర్తలతో గత రెండు రోజులుగా సమాలోచనలు నిర్వహిస్తున్నారు. ఒక‌వేళ బాబు భూమాని నెత్తిన పెట్టుకుంటే ప్ర‌భాక‌ర్ రెడ్డి పార్టీ మారే ఛాన్సుంద‌ని చెప్పుకుంటున్నారు. ఈనెల 15 లేదా 18 తేదీల్లో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. అయితే ప్ర‌స్తుతానికి వేచి చూసే ధోర‌ణిలో ఉన్నారుట‌.