లిఫ్టులో ఇరుక్కుని బాలుడి మృతి!

Thursday, May 24th, 2018, 05:18:04 PM IST

తన కుటుంబానికి ఎంతోకొంత ఆర్ధికంగా అండగా ఉండాలని భావించిన ఒక బాలుడు లిఫ్టులో ఇరుక్కుని హఠాన్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే, కాచిగూడ చప్పల్ బజార్ లో నివసిస్తున్న బుజ్జి అనే వ్యక్తి కుమారుడు అయిన 12 ఏళ్ళ వేణు, స్థానిక కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే ప్రస్తుతం వేసవి సెలవలు కావడంతో వేణుకు తన కుటుంబ పరిస్థుతులు బాగాలేక జరుగుబాటు తక్కువగా ఉండడంతో తనవంతుగా ఆర్ధిక సాయం అందించాలని అనుకున్నాడు. కాగా కొద్దిరోజుల క్రితం ఒక ప్రముఖ దినపత్రిక తరపున పేపర్ బాయ్ గా చేరాడు. తన దినచర్యలో భాగంగా రోజూ కాచిగూడ, బర్కత్ పుర ప్రాంతాల్లో పేపర్ వేసే వేణు, రోజులానే నిన్న కూడా పేపర్ వేయడానికి వెళ్లాడు.

బర్కత్ పుర భూమన్న లైన్ లోని చందే జైన్ ఇంట్లో రోజూ పేపర్ వేసే వేణు ఆ రోజు కూడా మూడో అంతస్తులోని అతని ఇంట్లో యధావిధిగా పేపర్ వేసి కిందకు వచ్చాడు. అయితే ఆ సమయంలో ఏదో మర్చిపోయిన వేణు మళ్లి మూడో అంతస్తుకు వెళ్లి, తిరిగి లిఫ్ట్ ఎక్కి వస్తుండగా వున్నట్లుండి ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన అతని తల్లితండ్రులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. ఘటన విషయంలో కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు వేణు మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వేణు మృతితో చప్పల్ బజార్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి……

  •  
  •  
  •  
  •  

Comments