బ్రేకింగ్ న్యూస్ : పిఎన్బి తరహాలో మరో బ్యాంక్ కుంభకోణం!

Sunday, April 15th, 2018, 08:18:53 PM IST


బ్యాంకుల్ని మోసం చేసి వేలాది కోట్ల రూపాయిల్ని దారి మళ్లించిన ఘనకార్యాలు ఒకటికొకటిగా బయటకు వస్తున్నాయి. మొన్న దేశంలోనే పెను ప్రకంపనలు రేపిన నీరవ్ మోడీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసు ఎప్పటికి మరిచిపోలేనిది. ఆ కేసు తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరు, ఖ్యాతి కొంతవరకు దెబ్బతిన్నదని చెప్పాలి. అయితే ఇప్పుడా వరసలో చేరింది యూకో బ్యాంక్. ఈ బ్యాంక్ కు రూ.621 కోట్లు టోపీ పెట్టేసిన వైనం కొత్త కలకలాన్ని రేపుతోంది. బ్యాంకు రుణాల పేరుతో సొంత బ్యాంకుకు రూ.621 కోట్ల మేర టోపీ పెట్టేసిన వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా సంస్థ మాజీ సీఎండీ అరుణ్ కౌల్ పై కేసు బుక్ చేశారు.

2010 నుంచి 2015 వరకు బ్యాంక్ సీఎండీగా వ్యవహరించిన కౌల్, పక్కా వ్యూహంతో పెద్ద ఎత్తున నిధుల్ని పక్కదారి పట్టించినట్లుగా భావిస్తున్నారు. రక్షకుడిగా వ్యవహరించాల్సింది పోయి, బ్యాంక్ కు వందలాది కోట్లు నష్టపోయేలా చేసిన వైనం బయటకు రావటంతో ఆ బ్యాంక్ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. చార్టెడ్ అకౌంట్ల సాయంతో దొంగపత్రాలు సృష్టించి అబద్ధపు మాటలతో వందలాది కోట్లు పక్కదారి పట్టించిన వైనం ఇప్పుడు బ్యాంకింగ్ వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. యూకో బ్యాంక్ వద్ద నుంచి దపాల వారీగా ఇరా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రా ఇండియా లిమిటెడ్ (ఈఈఐఎల్) రూ650 కోట్లు రుణంగా తీసుకుంది.

ఇంత భారీ మొత్తం దేని కోసం రుణం తీసుకున్నది చూస్తే తమ సంస్థ (ఈఈఐఎల్) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐఎఫ్సీఐల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకున్నామని యూకో బ్యాంక్ నుంచి తీసుకునే రుణంతో పాత రుణాల్ని కట్టేయనున్నట్లుగా చెప్పి రుణాలు మంజూరు చేయించుకున్నారు. ఆరు వందల కోట్లకు పైగా తీసుకున్న రుణంలో కేవలం రూ.59 లక్షల్ని మాత్రమే బ్యాంక్ రుణం తీర్చారు. మిగిలిన మొత్తాన్ని పక్కాదారి పట్టించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే యూకో బ్యాంక్ ప్రకటించిన నిరర్థక ఆస్తులు 2017 డిసెంబరు నాటికి రూ.7373.88 కోట్లు అని తేల్చగా ఇందులో మాజీ సీఎండీ బురుడీ కొట్టించిన రూ.650 కోట్ల రుణం ఉంది.

దీనిపై విచారణ షురూ చేసిన సీబీఐ మాజీ సీఎండీ కౌల్ తో పాటు ఈఈఐఎల్ సీఎండీ హేమ్ సింగ్ మరో ఇద్దరు చార్టెడ్ అకౌంటెట్లతో పాటు పవన్ బన్సాల్ (మెస్సర్స్ ఆల్దియస్ ఫిన్ సెర్వ్ ప్రైవేట్ లిమిటెడ్) లపై కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటనలు ఇంకెన్ని బయటకి వస్తాయో తెలియదుగాని, ఇటువంటి సంఘటనల వల్ల ప్రజలు మున్ముందు బ్యాంకు లును నమ్మే పరిస్థితి ఉండదని, దాని వల్ల ఆర్ధిక వ్యవస్థకి పెను ప్రమాదం జరుగుతుందని ఆర్ధీక నిపుణులు అంటున్నారు……