బ్రేకింగ్ న్యూస్ : ఆయన మంచి గాయకుడు కూడా అంటున్న ఐటి మంత్రి కేటీఆర్

Sunday, April 1st, 2018, 05:01:24 PM IST

ఎన్నో వ్యప్రయాసలతో, అలానే ఎందరో మహానుభావుల, త్యాగధనుల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ ఎస్ అధినేత ఆ రాష్ట్ర తొట్ట తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే కేసీఆర్ కేవలం ఒక ఉద్యమ నేతగానే చాలా మందికి తెలుసునని, అయితే ఆయనకు కళల పట్ల మక్కువ ఉండేదని, అందులో భాగంగా ఆయన చిన్నప్పుడు కొన్ని గీతాలు కూడా ఆలపించేవారని, ఆయన తనయులు ఐటి మంత్రి కేటీఆర్ తెలిపారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారి కోసం స్పర్శ్ హోస్పైస్ సంస్థ హైదరాబాద్ లోని ఖాజాగూడలో ఆస్పత్రిని నిర్మించనుంది.

నిధుల సేకరణలో భాగంగా మాదాపూర్లోని శిల్పకళావేదికలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఖాజాగూడలో నిర్మిస్తున్న 70 పడకల ఈ కాన్సర్ ధర్మాసుపత్రి నిర్మాణానికి ఎకరా స్థలాన్ని కేవలం రూపాయి లీజుకు ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు. దవాఖాన నిర్మాణంలో భాగంగా అనుమతులకు అయ్యే ఖర్చులను జీహెచ్ఎంసీ భరిస్తుందన్నారు. స్పర్శ్ హోస్పైస్ చేస్తున్న సేవకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. నిధుల సేకరణలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు.

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కేసీఆర్ అభిమాని అని చెప్పారు. తన తండ్రి చాలా బాగా పాటలు పాడతారని ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లో అనేక పోటీలలో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకున్నారని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నందున పాటలు వినే అవకాశం తనకు దొరకదని మంత్రి కేటీఆర్ పేర్కొంటూ ఎస్పీ బాలు పాడుతున్నపుడు ప్రత్యక్షంగా చూడటం తనకెంతో ఆనందాన్నిచ్చిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కొన్నివేల పాటలు పాడిన బాలు గారు ఎంతో మంది యువ గాయని గాయకులకు ఆదర్శమని ఆయన తెలుగు సినిమా పరిశ్రమ వారు అవడం మనకు గర్వకారణమని కొనియాడారు….