బ్రేకింగ్ న్యూస్ : త్వరలో అతి తక్కువ ధరకే జియో హోమ్ టివిలు ?

Monday, April 16th, 2018, 10:44:45 PM IST


టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు అని చెప్పాలి. ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ ఇంత చవుకగా, తక్కువధరకు లభిస్తుందంటే దానికి ప్రధాన కారణమ్ జియో రాక అని చెప్పక తప్పదు. అటువంటి ఉచిత ఆఫర్లతో మొదలు పెట్టి, అతి తక్కువ కాలంలోనే 10కోట్లమంది చందాదారులను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత కూడా అతి తక్కువ ధరకే ఎక్కువ డేటాను అందిస్తూ, అత్యధిక వేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. అంతేకాదు, ఇతర టెలికాం సంస్థలకూ ముచ్చెమటలు పోయిస్తోంది. త్వరలోనే ‘జియో ల్యాప్‌టాప్‌’ వస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న మరో తీపి కబురును కూడా జియో చెప్పనున్నట్లు తెలుస్తోంది. జియో త్వరలోనే ‘జియో హోమ్‌ టీవీ’ పేరిట సరికొత్త సేవలను ప్రారంభించనుందట.

అంతేకాదు, అన్ని ఎస్‌డీ(స్టాండర్డ్‌ డెఫినేషన్‌) ఛానళ్లను నెలకు రూ.200లకే అందించనుందని సమాచారం. ఇక ఎస్‌డీ+హెచ్‌డీ(హై డెఫినేషన్‌) ఛానళ్లు రూ.400కే అందిస్తుందని చెబుతున్నారు. ఇదే జరిగితే డీటీహెచ్‌ రంగంలో సరికొత్త సంచలనానికి తెర తీసినట్లే అవుతుంది అని వినికిడి. ఈ సేవలకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. సరికొత్త టెక్నాలజీ ఎన్‌హేన్సడ్‌ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్‌ సర్వీస్‌ ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. జియో సంస్థ ప్రతినిధుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే సేవలను అందిస్తోందన్న జియో బ్రాడ్‌కాస్ట్ ‌యాప్‌నకు సరికొత్త రూపమే ఈ ‘హోం టీవీ’. అందుకోసం శాంపిల్ గా ఇటీవల హెచ్‌డీ ఛానళ్లను కూడా పరీక్షించారట. కాగా త్వరలో జియో వినియోగదారులందరికీ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడవలసి వుంది…..