బ్రేకింగ్ న్యూస్ : త్వరలో ‘జియో’ సరికొత్త లాప్ టాప్

Thursday, April 12th, 2018, 07:13:41 PM IST

జియో రాకతో భారతీయ టెలికాం వ్యవస్థలో ఎంతటి విప్లవం వచ్చిందో అందరికి తెలిసిందే. ఒకప్పుడు 1జిబి ఇంటర్నెట్ ప్యాక్ వేయించాలంటే, ఒక సాధారణ వినియోగదారుడికి దాదాపు రూ.250 పెట్టవలసి వచ్చేది. ప్రస్తుతం అదే ధరకు రోజుకు 1 నుండి 2 జిబి ఇంటర్నెట్ సదుపాయం తో అపరిమిత కాల్స్ ప్యాక్ లు మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. అయితే ప్రస్తుతం తమ వినియోగదారులు ఇతర నెట్వర్క్ లకు వెళ్లకుండా కాపాడుకునేందుకు జియో ఇప్పుడు మరో కొత్త గ్యాడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. అవే “ల్యాప్‌టాప్స్‌ విత్‌ సిమ్‌కార్డ్స్‌”. సాధారణంగా ల్యాప్‌టాప్‌లకు సిమ్‌ కార్డులు ఉండవు. కానీ జియో సిమ్‌ కార్డులతోనూ పనిచేసే ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టాలనుకుంటోంది.

ఈ నూతన ప్రాజెక్ట్‌ కోసం జియో క్వాల్కమ్‌తో చర్చలు జరుపుతున్నట్లు క్వాల్కమ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మైగ్యుల్‌ నున్స్‌ ఇటీవల వెల్లడించారు. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్‌లను భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జియో 4జీ ఫోన్ల విషయంలో ఇప్పటికే జియో, రిలయన్స్‌ రీటెయిల్‌తో కలిసి క్వాల్కమ్‌ పనిచేస్తోంది. వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంపొందించుకోవడానికే జియో ఈ కొత్త గ్యాడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌ట్యాప్‌ల తయారీ నిమిత్తం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ కు ప్రసిద్ధి చెందిన స్మార్ట్‌రాన్‌ కంపెనీతో క్వాల్కమ్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ప్రాసెసర్‌ ద్వారా ల్యాప్‌టాప్‌లో సిమ్‌ కార్డును ప్రవేశపెట్టడం సులువు అవుతుంది. ‘ఆల్వేస్‌ కనెక్టెడ్‌ పీసీస్‌’ పేరిట ఈ ల్యాప్‌టాప్‌ విత్‌ సిమ్స్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా క్వాల్కమ్‌‌ అంతర్జాతీయ బ్రాండ్లు అయిన హెచ్‌పీ, అసూస్‌, లెనోవో కంపెనీలతో కలిసి పనిచేస్తోంది.

వెరైజోన్‌, ఏటీ అండ్‌ టీతో పాటు అమెరికా, యూరప్‌కు చెందిన కంపెనీలు కూడా ఈ ప్రాజెక్ట్‌కు దోహదపడుతున్నాయి. భారతదేశంలో ఏటా విక్రయించే 5 మిలియన్ల ల్యాప్‌టాప్‌లలో 20 శాతం ల్యాప్‌ట్యాప్‌లను సిమ్‌కార్డులతో పనిచేసేలా చేయొచ్చని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కొత్త తరహా ల్యాప్‌టాప్‌లు కంపెనీలకు కొత్తగా అనిపించొచ్చు కానీ వినియోగదారుల అవసరాలు, కంపెనీలు విధించే సుంకాల ఆధారంగా వీటి ద్వారా సర్వీస్‌ ప్రొవైడర్లు రూ.300 నుంచి రూ.1000 కోట్ల వరకు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే వీటిని టెస్ట్ చేయడం జరిగిందని, అతి త్వరలో ఈ లాప్ టాప్ లు అందుబాటులోకి రానున్నట్లు జియో కంపెనీ ప్రతినిధులు అంటున్నారు….