ప్లాస్టిక్ ను తినే ఎంజైమ్ ను కనుగొన్న సైంటిస్ట్ లు

Wednesday, April 18th, 2018, 02:29:55 AM IST

ప్రస్తుతం మానవాళికి ముప్పుగా మారిన కాలుష్యాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఒకటి. ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం.. ఇది భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్లు పడుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు అనుకోకుండా ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను కనుగొన్నారు. బ్రిటన్ యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీస్ నేషనల్ రెనివబుల్ ఎనర్జీ లేబొరేటరీ రీసెర్చర్లు ఈ ఎంజైమ్‌ను కనిపెట్టారు. కొన్నేళ్ల కిందట జపాన్‌లోని వేస్ట్ రీసైక్లింగ్ సెంటర్‌లో లభించిన నేచురల్ ఎంజైమ్ నిర్మాణాన్ని పరీక్షిస్తున్న సమయంలో ఈ కొత్త ఆవిష్కరణ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

ఈ కొత్త ఎంజైమ్‌కు ఇడియోనెలా సాకైన్సిస్ 201-ఎఫ్6 అని పేరు పెట్టారు. ప్రస్తుతం ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాడుతున్న పాలీఎథిలిన్ టెరెఫ్తలేట్‌ను ఈ ఎంజైమ్ తినేస్తుందని సైంటిస్టులు చెప్పారు. ఓ ఎంజైమ్ నిర్మాణాన్ని పరీక్షిస్తుంటే.. అనుకోకుండా దానికి ఎంతో మెరుగైన పెట్ ప్లాస్టిక్స్‌ను తినేసే ఎంజైమ్‌ను కనుక్కోవడం విశేషమే అని రీసెర్చర్ గ్రెగ్ బెకామ్ చెప్పారు. పెట్‌ను ఉపయోగించి తయారవుతున్న కోట్లాది ప్లాస్టిక్ బాటిల్స్ రీసైక్లింగ్‌కు మంచి పరిష్కారం దొరికినట్లేనని ఆయన అన్నారు. పెట్‌నే కాదు గాజు బీర్ బాటిల్స్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పాలీఎథిలిన్ ఫ్యూరాండికార్బోగ్జిలేట్ (పెఫ్)ను కూడా ఈ ఎంజైమ్ తినగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా తయారుచేసిన ఈ పెఫ్ బాటిల్స్ కూడా వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయని, ఈ ఎంజైమ్ వల్ల ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరికిందని వాళ్లు అంటున్నారు.

ప్రస్తుతం పరిశోధనల దశలోనే ఉన్నా.. ప్లాస్టిక్ వ్యర్థాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ ఎంజైమ్ ఆవిష్కరణ తమకు దారి చూపిందని సైంటిస్టులు స్పష్టంచేశారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో వీళ్ల అధ్యయనాన్ని ప్రచురించారు. ఈ ఎంజైమ్‌ను మరింత అభివృద్ధి చేసి పారిశ్రామికంగా వాడే స్థాయికి తీసుకెళ్లడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు 830 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను తయారు చేశారు. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్నది. ఇప్పటివరకు కేవలం 9 శాతం ప్లాస్టిక్‌ను మాత్రమే రీసైకిల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా పది వేల కోట్ల డాలర్లకుపైగా ప్లాస్టిక్ వ్యాపారం నడుస్తున్నది.

  •  
  •  
  •  
  •  

Comments