నాసా ఫోటోలు : అగ్ని గోళంలా మండుతున్న ఇండియా

Monday, April 30th, 2018, 11:36:08 AM IST

నాసాకు చెందిన ఫైర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎఫ్‌ఐఆర్‌ఎంఎస్) విడుదల చేసిన ఫొటోలు శాస్త్రవేత్తలను ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో పెరిగిపోతున్న పంటల దహనాల కారణం చేత కలుగుతున్న నష్టాన్ని ఈ ఫొటోలు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఫైర్ లొకేషన్స్‌ను ఈ ఫొటోలు చూపెడుతున్నాయి. ఉత్తర, మధ్య భారత్‌లో ఈ లొకేషన్స్ పెద్ద సంఖ్యలో ఉండగా.. దక్షిణ భారతంలోనూ కొన్ని ప్రాంతాలు ఉండటం నిజంగా ఆందోళన కలిగిస్తున్నది. నాసాకు చెందిన ఈ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.. సాధారణంగా ఎప్పటికప్పుడు అగ్నికి ఆహుతి అవుతున్న ప్రాంతాల ఫొటోలను తీస్తుంటుంది. ఇండియాలో చూపెడుతున్న ఈ ప్రాంతాల్లో అడవులతోపాటు పంట దహనాలకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి.

దేశంలో పెరిగిపోతున్న పంట దహనాల సమస్యను ఈ ఫొటోలు కళ్లకు కడుతున్నాయి. పంట దహనాలు, వాటి వల్ల పెరుగుతున్న కర్బన ఉద్గారాలు ఆందోళన రేకెత్తించేలా చేస్తున్నాయి. ఒకప్పుడు కేవలం హర్యానా, పంజాబ్‌లాంటి రాష్ర్టాలకే పరిమితమైన పంట దహనాలు.. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. వీటివల్ల కాలుష్యం పెరిగిపోవడం, ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలకు చేరడంలాంటి అనర్థాలు తలెత్తుతున్నాయి. ఖర్చు తక్కువగా ఉండటం, కూలీల అవసరం లేకపోవడంతో రైతులంతా మిగిలిపోయిన పంటను దహనం చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. కానీ దానివల్ల కలిగే పర్యవసానాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక దేశంలో ఉన్న మొత్తం అడవుల్లో 33 నుంచి 90 శాతం వరకు అగ్నిప్రమాదాలకు గురవుతున్నట్లు కూడా ఇంటర్నేషనల్ స్ట్రేటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ సర్వేలో తేలింది.

  •  
  •  
  •  
  •  

Comments