ఫ్లాష్ న్యూస్ : మసీదులో దారుణ హత్య !

Wednesday, March 28th, 2018, 03:12:48 PM IST

నేడు మనిషి నూతన ఆలోచనలు, పోకడలతో ఎంత ముందుకు పోతున్నప్పటికీ, అతనిలోని మానసిక ప్రవర్తన తీరు మాత్రం రోజురోజుకు మరింత దిగజారిపోతోంది. చిన్న పెద్ద, ముసలి ముతక, మంచి చెడు అని తేడా లేకుండా హత్యోదంతాలు, మారణకాండలు ప్రస్తుత సమాజాన్ని కుదిపేస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగిన ఒక సంఘటన మనిషిలోని వికృత పైత్యానికి నిలువెత్తు నిదర్శనం గా చెప్పవచ్చు.

ఏకంగా ముస్లిం లు ఎంతో పవిత్రంగా ప్రార్ధన చేసుకునే మసీదులో ఒక దుండగుడు హత్య చేసాడు. విషయం లోకి వెళితే ఈ ఘటన సూడాన్‌లోని కసాల నగరంలో మంగళవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక కసాల నగరంలోని ఓ మసీదులో సాయంకాల ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మసీదులోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఎవ్వరూ తనకు బదులు చెప్పకపోవడంతో ఆగ్రహించిన దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రార్థన చేస్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు.

ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొంత సమయం తర్వాత తేరుకున్న అక్కడి వారు ఆ దుండగుడిపై దాడిచేసి చంపేశారు. గాయాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కసాల రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని, వందల మంది సూడాన్‌ సైనికులు నగరాన్ని మోహరించినా ఇలాంటివి జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు….