రగులుతున్న ఏపీ : హోదా కోరుతూ ఆందోళనలు, నిరసనలు, జాతీయ రహదారుల దిగ్బంధం !!

Thursday, March 22nd, 2018, 03:43:12 PM IST

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం రోజు రోజుకూ బలపడుతోంది. విభజన హామీలు నెరవేర్చడం లో కేంద్ర ఎన్డీయే ప్రభుత్వం విఫలమవడంతో, ఆంధ్ర లో దాని మిత్రపక్షమైన టిడిపి, ఎన్డీయే నుండి విడిపోవడం జరిగింది. అలానే ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అన్ని హామీలు నెరవేర్చాలని అధికార టిడిపి కూడా పట్టు పడుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు హోదా కోసం నేడు రహదారుల దిగ్బంధం చేపట్టాయి. దీనిలో భాగంగా ప్రత్యేక హోదా సాధన సమితి నేడు జాతీయ రహదారుల దిగ్బంధం చేపట్టింది.

ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారుల్ని దిగ్బంధించి నిరసన తెలుపుతున్నారు. అయితే వైసిపి, జనసేన, కాంగ్రెస్‌, వామపక్షాలు ఈ కార్యక్రమం చేపట్టగా అధికార టిడిపి కూడా ఈ బంద్ కు మద్దతు ప్రకటించింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖలో అఖిలపక్ష నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్రం ఇప్పటికైనా విభజన హామీలు నెరవేర్చకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుతుందని నేతలు హెచ్చరించారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు ఉన్న 16వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధం చేసినట్లు వారు తెలిపారు. జాతీయ రహదారులపై వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుని నిరసన తెలుపుతున్నారు. అటు అనంతపురం, బెంగళూరు జాతీయ రహదారిపైనా ఆందోళనకారులు రాస్తారోకో చేపట్టి వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లా నందిగామలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీకి వ్యతిరరేకంగా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

ప్రత్యేకహోదా ఆంధ్రప్రదేశ్‌కు సంజీవని లాంటిదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గత నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. దీంతో ఆ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా భారీ బందోబస్తుతో పర్యవేక్షిస్తున్నారు. ఏపి ప్రత్యేక హోదా కల్పించాలంటూ తెదేపా శ్రేణులు విజయవాడలో ఆందోళన నిర్వహించాయి. చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపై రామవరప్పాడు కూడలి వద్ద తెదేపా యువనాయకుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేలా తమ నిరసనలు ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్ని ఆంధ్రకు అన్యాయం చేయాలనీ చూస్తోంది. ఈ కుట్రను ఏ తెలుగు వాడు సహించదని, మున్ముందు ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం డాలనుంచుందని వారు హెచ్చరించారు…..