బస్సు నడిపిన మతిస్థిమితం లేని వ్యక్తి…. ఏమి జరిగిందంటే?

Wednesday, April 11th, 2018, 04:43:45 PM IST

నేడు మహారాష్ట్రలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ఖాళీ బస్సు నడిపి హల్‌చల్ చేశాడు. మహారాష్ట్ర స్టేట్‌ రోడ్‌ రవాణా సంస్థ(ఎంఎస్‌ ఆర్టీసీ)కు చెందిన ఖాళీ బస్సు బైసార్‌ డిపో నుంచి బయలుదేరింది. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కొద్దిదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్‌, కండక్టర్‌ ఇద్దరూ టీ తాగడానికి బస్సును కాసేపు రోడ్డు పక్కన నిలిపారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడి వచ్చి బస్‌ను స్టార్ట్‌ చేసి నడుపుకొంటూ వెళ్లిపోయాడు. అయితే అక్కడున్న డ్రైవర్‌, కండక్టర్, స్థానికులు, అతడిని వారిస్తున్నా వినిపించుకోకుండా సుమారు 3కి.మీ మేర అలాగే నడుపుకొంటూ వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక బస్సు అదుపు తప్పడంతో రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు పాక్షికంగా దెబ్బతింది.

ఇంతలో అక్కడికి చేరుకున్న బస్సు డ్రైవరు, స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఘటనలో అతనికి ఏమి కాకపోవడం కొంత సంతోషించవలసిన విషయం అని చెప్పుకోవాలి. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం అతడిని ప్రశ్నించగా, బస్సు నడపాలనే కోరికతోనే తాను ఇలా చేశానని చెప్పాడు. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు పోలీసు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతడి మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. బస్సును లాక్‌ చేయకుండా అలాగే ఉంచేసిన డ్రైవర్‌, కండక్టర్‌ మీద డిపో యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడాలని సూచించింది….