ప్లాస్టిక్ వినియోగానికి బయో ప్లాస్టిక్ తో చెక్?

Monday, June 11th, 2018, 12:45:46 PM IST

ప్రస్తుత కాలంలో మనం నిత్యం వాడే దాదాపుగా ప్రతి చిన్న వస్తువు విషయంలో ప్లాస్టిక్ అత్యంత ఆవశ్యకం అయింది. మరీ ముఖ్యంగా మార్కెట్ లో రకరకాలుగా లభ్యమయ్యే ప్లాస్టిక్ కవర్ల వినియోగం మరింత ఎక్కువైంది. అయితే దీనివల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లడమే కాకుండా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులతో సహా ఆహారపదార్ధాలు పడవేసినపుడు వాటిని ఆవులు, మేకలు, గొర్రెల వంటి జంతువులు ఆహారంతో సహా ఆ కవర్లను తినడం వలన అవి జీర్ణంకాక పలురకాల ఆరోగ్య సమస్యలతో మరణించడం అక్కడక్కడా చూస్తున్నాము. అంతే కాదు మనం వాడి పడవేసిన ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ సంచులు సైతం ఎప్పటికీ భూమిలో నిక్షిప్తం కాక అలానే ఉండిపోతుంటాయి. ఇందువల్ల కొందరు వాటిని తగులబెట్టడం వంటివి చేస్తున్నారు. అలా తగల బెట్టడం వల్ల విషవాయువులు వెలువడి వాతావరణానికి ముప్పుగా పరిణమిస్తున్నాయి. అందువల్ల దీనికి అడ్డుకట్ట వేయడానికి అధికారులు బయో ప్లాస్టిక్ ను తెరమీదకు తీసుకొచ్చారు.

అయితే ప్రస్తుతం మధ్యతరగతి వారు ఎక్కువగా బయో డిగ్రేడబుల్ బయో ప్లాస్టిక్ వినియోగానికి మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు. అయితే తిను బండారాలు, జ్యూసులు, వంటి వాటికి వినియోగించే ప్లాస్టిక్ సంచులు బదులు సీసం తో కూడిన వస్తువులు తాయారు చేయవచ్చని అంటున్నారు. అలానే స్టైరోఫోమ్ ప్లేట్లు, గ్లాసులకు బదులు బయోమాస్ తో తాయారు చేసిన ప్లేట్లు, గ్లాస్ లు వాడడం మంచిదని చెపుతున్నారు. ఇక వివిధ రూపాల్లో నశించే డిగ్రేడబుల్ ప్లాస్టిక్ లో ఒకరకం ఫోటో డిగ్రేడబుల్ ప్లాస్టిక్. అంటే ఇది సూర్య కాంతి పడిన వెంటనే, అలానే నీటి చుక్కలు పడిన వెంటనే కరిగి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి కలిసిపోతుంది. అందువల్ల ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఇటువంటి బయో ప్లాస్టిక్ వినియోగం వల్ల కొంతవరకైనా పర్యావరణాన్ని, జీవరాసుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అయితే ఇప్పటికే ఈ విధానాన్ని అన్ని చోట్ల అవలంబించేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నట్లు, అది ఒక ఆహ్వానించదగ్గ శుభపరిణామమని వారు అంటున్నారు……