పశ్చిమాన జగన్ జండా పాతుతారా?

Wednesday, June 13th, 2018, 02:57:12 AM IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండువేల కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అయన యాత్ర నేడు పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. జగన్ పాదయాత్రకు రాజమండ్రిలోని రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మొత్తం జనావాహినితో నిండిపోయింది. అయితే ఈ విషయమై నిన్న స్థానిక పోలీస్ అధికారులు బ్రిడ్జి పైకి జనం ఎక్కువగా వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు. కాగా వైసిపి నాయకులు ఎటువంటి సమస్యలు రాకుండా తాము చూసుకుంటామని హామీ ఇవ్వడంతో బ్రిడ్జి పైకి జనాన్ని అనుమతిచ్చారు. క్రితం ఎన్నికల్లో పశ్చిమాన మొత్తం వున్న 15 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో వైసిపి గెలువలేకపోయింది. మొత్తం15లో, 14 స్థానాలను టీడీపీ కైవశం చేసుకోగా మిగిలిన ఒక స్థానాన్ని దాని మిత్రపక్షమైన బీజేపీ సొంతం చేసుకుంది. కావున ప్రస్తుతం అధినేత జగన్ రానున్న ఎన్నికల్లో ఈ ప్రాంతంపై మరింత దృష్టి పెట్టి తమ పార్టీ జండాను పాతాలని చూస్తున్నారు.

వాస్తవానికి గత ఎన్నికల్లో చంద్రబాబు అనుభవజ్ఞుడు అనే మంత్రం బాగా పనిచేయడం, అందునా రాష్ట్రం విడిపోవడం, ఇక జనసేన అధినేత పవన్ కూడా టీడీపీ-బిజెపి కూటమికి మద్దతివ్వడం వంటి అంశాలు టీడీపీ కి బాగా లభించాయని తెలుస్తోంది. అయితే ఇకపై రానున్న ఎన్నికల్లో ఎలాగైనా 10కి పైగా సీట్లను కైవశం చేసుకునేలా జగన్ అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇదివరకు ఆ 15 నియోజకవర్గాల్లో ఎవరిని నిలబెట్టారో వారి బలాబలాలేంటో తెలుసుకుని వాటిని సరిచేసుకుని ప్రజల్లోకి వెళ్లేవిధంగా అయన వ్యూహరచన చేస్తున్నట్లు వినికిడి. అయితే ఈ సారి కూడా పశ్చిమలో సీట్ల గెలుపు అంత సులువుకాదని, ఎందుకంటే ఓ వైపు టీడీపీ మాదిరి పవన్ కూడా సొంతంగా పోటీ చేస్తున్నారు కాబట్టి, అందునా ఆయన ఇక్కడి ప్రధాన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కొంతవరకు ఓట్లు చీలే అవకాశం వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కావున జగన్ ఏవిధంగా ప్రణాళికలు రచించి ఇక్కడి ప్రాంతంలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది…..

  •  
  •  
  •  
  •  

Comments