వాట్సాప్ కి సవాలు విసురుతున్న పతంజలి “కింబో మెసెంజర్” ?

Wednesday, August 15th, 2018, 04:55:28 PM IST

ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్స్ లో సోషల్ మీడియా మాధ్యమాలు లేకుండా ఎవరు వుండరు అనే చెప్పాలి. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు, దాదాపు మనం చేసే చాలా విషయాలను కొందరు తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేయడం పరిపాటి అయిపొయింది. ఇక ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు వాట్సాప్ మరింత ప్రాచుర్యం పొందినవి. అయితే ఆండ్రాయిడ్ మొబైల్ వున్న ప్రతిఒక్కరు వాట్సాప్ చాటింగ్ మామూలుగానే చేస్తుంటారు, అది విదేశీలుయు రూపొందించిన యాప్ అని, అందువల్ల దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల మెసెంజెర్స్ వచ్చినప్పటికీ వాట్సాప్ అంత గుర్తింపు పొందలేదని చెప్పాలి. ఇక కొన్నాళ్ల క్రితం యోగ బాబా రామ్ దేవ్, అనూహ్యంగా వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా కింబో మెసెంజర్ ను ప్రవేశపెట్టారు. కాగా ఇందులో ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే,ఆ మెసెంజర్ ని అలా గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టిన ఒక గంట లోపే దానిలో అనేక సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని, ప్లే స్టోర్ దానిని తొలగించడం జరిగింది. ఇక ఆ తరువాత దానిలోని సెక్యూరిటీ మరియు ఇతర లోపాలను సరిచేసుకుని ఇదిగో ఇన్నాళ్లకు అనగా ఆగష్టు 27న మళ్లి మన ముందుకురాబోతోంది.

ఆ విషయాన్ని పతంజలి సంస్థ సహా వ్యవస్థాపకులు బాలకృష్ణ నేడు తన అధికారిక ట్విట్టర్ ద్వారా కింబో త్వరలో రాబోతున్నట్లు ప్రకటించారు. ఇదివరకు కింబోలో వున్న అన్నిలోపలను అధునాతన బృందం నేతృత్వంలో సరిచేయడం జరిగిందని, ఇక ఈ నెల 27న కింబో సరికొత్తగా ఎటువంటి ఆటంకంలేకుండా మీకు సేవలు అందించబోతోంది అంటూ అయన ట్వీట్ చేసారు. అచ్చం వాట్సాప్ ని పోలి వుండే ఈ కింబో మెసెంజర్, వాట్సాప్ లో ఉండే అన్ని రకాల ఫీచర్లను కలిగి ఉంటుంది. చాట్, వీడియో కాలింగ్, షేర్ మై లొకేషన్ వంటి అన్ని సదుపాయాలతో పాటు, వైప్ అవుట్, ఘోస్ట్ చాటింగ్ వంటి మరికొన్ని ఫీచర్లను కలిగివుంటుందట. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే కాదు, ఐఓఎస్ యూజర్లకు కూడా ఆ రోజునుండి అందుబాటులో ఉంటుంది. అయితే ఇదివరకు ప్రవేశపెట్టిన వెంటనే, ఎన్నోలోపాలు బయటపడ్డ ఈ కింబో మెసెంజర్, త్వరలో ప్రవేశబెట్టబోయే ఈ నూతన వెర్షన్ తో యూజర్లను ఏవిధంగా ఆకట్టుకుని వాట్సాప్ కి ఏ మేరకు గట్టి పోటీ ఇస్తుందో చూడాలి…..