అటు బాబు, ఇటు జగన్.. కుర్రాళ్ళని ఆడేసుకుంటున్నారు !

Wednesday, October 3rd, 2018, 10:36:55 AM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యువతలో ఒకరకమైన అయోమయం నెలకొంది. బాబు వస్తేనే జాబని, నిరుద్యోగులకు నెల నెలా భృతి ఇస్తామని ఊదరగొట్టి ఓట్లేయించుకున్న చంద్రబాబు ఆ హామీలను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయారు. నాలుగున్నరేళ్ల యువతని గాలికొదిలేసి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు యువ నేస్తం పేరుతో నెలకు 1000 ఇస్తామంటూ హడావుడి చేస్తున్నారు. ఇన్ని రోజుల పాలనలో ఏనాడూ యువతతో పూర్తిస్థాయిలో మమేకం కాలేకపోయారు బాబు.

దీంతో అధికార ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని కోల్పోయిన యువతీ యువకులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అయినా ఏదో ఒక దారి చూపకపోతారా, తమ తరపున పోరాడకపోతారా అనే ఉద్దేశ్యంతో సంకల్ప యాత్రలో ఆయనెక్కడ కనిపిస్తే అక్కడకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకుంటుంటే జగన్ వాళ్ళను ఓదార్చి నేను సిఎం అయ్యాకే మీకు బ్రతుకు, భవిష్యత్తు అంటున్నారు తప్ప తక్షణ ఉపశమనం చూపే యత్నమే చేయట్లేదు. సరే పోనీ సిఎం అయ్యాక ఇస్తానంటున్న ఆ ఉద్యోగాలైనా ఎలా ఇస్తారు, దానికేమైనా ప్రత్యేక పథకాన్ని రూపొందిస్తారా అనేది కూడ వివరణ ఇవ్వడంలేదు. ఇటీవల వైకాపా నేతలు ఊదరగొడుతున్న నవరత్నాల్లో సైతం నిరుద్యోగులు ప్రస్తావనే లేదు.

ఇలా చంద్రబాబు ప్రభుత్వం చేతిలో దగా కాబడి, స్పష్టత, నమ్మకం లేని వైఎస్ జగన్ మాటలకు విసుగెత్తిన యువత రాబోయే రోజుల్లో తమకు అండగా నిలబడేదెవరో తెలీక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.