ర్యాష్ డ్రైవింగ్ తో విజయవాడలో కార్ బోల్తా…..మ్యాటర్ ఏంటంటే ?

Sunday, July 29th, 2018, 08:05:29 PM IST

ఓవైపు పోలిస్ లు మరోవైపు ప్రభుత్వం ఎన్నిరకాల హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా దేశంలో ఎక్కడో ఒకచోట కొందరు ర్యాష్ డ్రైవింగ్ తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కొందరు యువత అయితే, ఒళ్ళు పై తెలియకుండా వాహనాలు నడుపుతున్నారనే విమర్శలు ఇటీవల వెల్లువెత్తుతున్నాయి. ఇక విషయంలోకి వెళితే, నేడు విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లయింది. నగరంలోని ఒక ప్రాంతంలో ఇద్దరు యువతులు మరియు ఇద్దరు యువకులు కలిసి తమ కార్లో ప్రయాణం చేస్తూ, ఒక శివారు ప్రాంతంలో వేగాన్ని మరింత పెంచడంతో అదుపు తప్పిన వారి కారు ఎదురుగా వున్న వాటర్ మోటార్ ఢీకొట్టడంతో ఆ మోటార్ బద్దలయి కార్ ఒక్కసారిగా పక్కనే వున్న డ్రైనేజీ కాలువలో పడిపోయింది.

అయితే ఈ ఘటనలో ఆనందం కలిగించే విషయం ఏమిటంటే, ఆ నలుగురిలో ఎవ్వరికీ ఏమి కాకపోవడమే, ఆ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక ఘటన అనంతరం ఆ యువకుల్లోకి ఒక యువకుడు తన స్నేహితులను ఆ స్థలానికి పిలిపించి నానా గొడవ చేస్తుండడంతో అతడు మద్యం సేవించి గొడవ చేస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత జరిగినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీస్ లు ఏ మాత్రం పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడంతో, కొందరు పోలీస్ ల తీరుపై మండిపడుతున్నారు. ఇటువంటి ర్యాష్ డ్రైవింగ్ వల్ల మనకే కాదు మన ఎదురుగా వచ్చేవారికి కూడా ప్రమాదం జరిగే అవకాశం వుందని కనుక, జాగ్రత్తగా వాహనాలు నడపాలని నిపుణులు అంటున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments