కిడ్నీరాకెట్ కేసులో టాలీవుడ్ సీనియర్ నటుడిపై కేసు నమోదు!

Wednesday, May 9th, 2018, 07:53:47 PM IST


సినీ, బుల్లితెర నటుడు బాలాజీ తనను నమ్మించి మోసం చేసాడని లక్ష్మి అనే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఆయనపై జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో నేడు కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే నటుడు బాలాజీ భార్య కృష్ణవేణికి అనారోగ్యంతో రెండు కిడ్నీలు పనిచేయని కారణంగా, ఒకరోజు లక్ష్మి ఇంటికి వచ్చిన బాలాజీ భార్య అనారోగ్యం విషయం చెప్పి, తనని కిడ్నీ దానం చేయవలసిందని, అందుకు తాను రూ.20 లక్షలు ఇస్తాను అని అన్నాడని చెప్పింది.

అయితే భర్త చనిపోయి కుటుంబ భారం మోయలేక నానా అవస్థలుపడుతున్న తాను కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నానని, కాగా గత ఏడాది క్రితం జరిగిన ఆపరేషన్లో కృష్ణవేణికి కిడ్నీ ఇచ్చానని, అయితే బదులుగా డబ్బులు ఇస్తాను అన్న బాలాజీ అప్పటినుండి ఇప్పటివరకు కేవలం రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చాడని వాపోయింది. అంతేకాక ఆసుపత్రిలో కొన్ని తెల్లకాగితాలమీద సంతకాలు చేయించుకుని డబ్బుమొత్తం ముట్టినట్లు మోసం చేసాడని, మిగతా డబ్బులకోసం ఫోన్ చేస్తే తిట్టి ఫోన్ పెట్టేస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అందుకని తనకు న్యాయం చేయమని నటి శ్రీరెడ్డిని కలిశానని, శ్రీరెడ్డి ద్వారా మానవ హక్కుల కమీషన్, మా అసోసియేషన్ లలో బాలాజీ పై ఫిర్యాదు చేసి ప్రస్తుతం జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు కేసు పెడదామని వచ్చినట్లు చెపుతోంది. అయితే కేసు విషయమై పోలీసులు బాలాజీని పిలిపించారు. కాగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన బాలాజీ తనవద్ద వున్న అగ్రిమెంట్ పేపర్స్ అలానే జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను పోలీసులకు సమర్పించాడు.

జూబిలీ హిల్స్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, లక్ష్మి నుండి ఫిర్యాదు స్వీకరించామని, న్యాయపరమైన సలహాతో కేసును పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మితో వచ్చిన శ్రీరెడ్డి మాట్లాడుతూ, కిడ్నీ ఇస్తే కేవలం డబ్బులు మాత్రమే కాదు, మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, నా ఇంటి పై పోర్షన్ రాసి ఇస్తాను, సినిమాల్లో కూడా మంచి క్యారెక్టర్లు ఇప్పిస్తాను అని నమ్మబలికి బాలాజీ ఈ విధంగా ద్రోహం చేసాడని, ఆయనపై కఠిన చెర్యలు తీసుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కోరింది……

Comments