ఎమ్మెల్యే లైంగిక దాడి కేసుపై సీబీఐ రెడ్ అలెర్ట్…

Friday, April 13th, 2018, 11:50:58 AM IST

ఉన్నావ్ లైంగికదాడి కేసులో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్ సెంగర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెంగర్‌పై ఐపీసీ, పోస్కో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోస్కో చట్టం కింద నిందితునిగా పేర్కొన్న వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని నిబంధనలు పేర్కొంటుండగా, దీనిపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ అతడిని అరెస్టు చేయకపోవడంపై అలహాబాద్ హైకోర్టు యూపీ సర్కార్‌పై మండిపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలాయని తాము చెప్పాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయడం కోసం సీబీఐని రంగంలోకి దించుతున్నామని, ఈ మేరకు కేంద్ర హోం శాఖకు ఒక లేఖను రాస్తున్నామని తెలిపారు. బాధితురాలు 17 ఏండ్ల యువతి అయినందున ఎమ్మెల్యేపై లైంగికదాడుల నుంచి బాలల పరిరక్షణ (పోస్కో) చట్టం కింద కేసులు పెట్టామని చెప్పారు. బాధిత యువతి మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తనకు ప్రాణభయం ఉందంటూ ఎమ్మెల్యే పేరు చెప్పలేదని, సిట్ బృందం ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు మాత్రం వారు ఎమ్మెల్యే పేరును బయటపెట్టారని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అవనీశ్‌కుమార్, రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు.

నిందితుడైన ఎమ్మెల్యేను డీజీపీ మాననీయ విధాయక్‌జీ (గౌరవనీయ శాసనసభ్యుడు) అంటూ సంబోధించడాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఇందుకు ఆయన ఇంకా నేరం రుజువు కాలేదు కదా? అని సమాధానమిచ్చారు. బాధిత యువతి కుటుంబానికి భద్రతను కూడా మరింత పెంచామని చెప్పారు. బాధిత యువతి తండ్రికి సరైన వైద్య సదుపాయం అందించడంలో విఫలమైనందుకు ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేశామని, మరో ముగ్గురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నామని అవనీశ్ కుమార్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదును పట్టించుకోని సఫీపూర్ సీఐ కువర్ బహదూర్‌సింగ్‌ను కూడా సస్పెండ్ చేశామని చెప్పారు. ఈ కేసును ప్రాథమికంగా దర్యాప్తు చేసిన సిట్ బృందం తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసిందని తెలిపారు. ఇదిలా ఉండగా బాధిత యువతి మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ దర్యాప్తు తర్వాత చేయవచ్చు.. ముందు ఎమ్మెల్యేను వెంటనే అరెస్టు చేయండి అని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే తమ చిన్నాన్నను కూడా చంపేస్తారని ఆమె ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments