జగన్ ఆస్తుల కేసులో కీలక తీర్పు

Friday, June 7th, 2013, 10:20:36 AM IST

ఆస్తుల కేసులో వైఎస్ జగన్ కు మరో షాక్ తగిలింది. ఆస్తుల అటాచ్ మెంట్ కు సంబంధించి ఈడీ నిర్ణయం సరైనదేనని అడ్జుడికేటింగ్ అధారిటీ తీర్పు చెప్పింది. రాంకీ ఫార్మాసిటీ ఆస్తుల అటాచ్ మెంట్ కు సంబంధించి ఈడీ నిర్ణయం సరైనదేనని ఈడీ న్యాయ ప్రాధికార సంస్థ తెలిపింది.

రాంకీ ఫార్మా సిటీకి చెందిన 143 కోట్ల 74 లక్షల రూపాయల ఆస్తులను ఈ ఏడాది జనవరి ఏడున ఈడీ జప్తు చేసింది. ఇందులో 10 కోట్ల రూపాయలు.. జగతి పబ్లికేషన్స్ ఖాతాలో రాంకీ సంస్థ జమ చేసింది. ఈ ఆస్తుల అటాచ్ మెంట్ నిర్ణయం సరైనదేనని న్యాయ ప్రాధికార సంస్థ తీర్పు చెప్పడంతో.. ఈ కేసులో ఈడీ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో మరికొన్ని కంపెనీల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉంది.

జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ప్రభుత్వం నుంచి భూములు పొంది లాభ పడ్డాయని పేర్కొంటూ… సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. జగతి పబ్లికేషన్స్ లో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిన రాంకీ సంస్థ.. ప్రభుత్వం నుంచి 914 ఎకరాలు లబ్ధి పొందిందని సీబీఐ ఆరోపిస్తోంది.

ఈ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ నిర్ణయాన్ని న్యాయ ప్రాధికార సంస్థ సమర్ధించడం జగన్ కు నిజంగా షాకే. వైఎస్ హయాంలో.. ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో లబ్ధి పొందిన సంస్థలు దానికి ప్రతిగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని.. ఇదంతా క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని సీబీఐ ఛార్జిషీట్లలో ఆరోపించిన విషయం తెలిసిందే. సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా మరికొన్ని కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.