కాంగ్రెస్ గుండెల్లో సీబీఐ క‌ల‌వ‌రం

Tuesday, November 20th, 2018, 10:19:06 AM IST

సీబీఐ వివాదం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ వివాదం త‌వ్వినా కొద్ది పుట్ట ప‌గులుతున్న చందంగా త‌యారైంది. గ‌త నెల రోజులుగా సంచ‌ల‌నంగా మారిన సీబీఐ వివాదం చినికి చినికి పెను తుఫానుగా మార‌బోతోంది. తాజాగా ఈ వివాదానికి సంబంధించిన కొత్త కోణం బ‌య‌ట‌ప‌డింది. మేడ్చ‌ల్ కాంగ్రెస్ అభ్య‌ర్థి కిచ్చ‌న్న‌గారి ల‌క్ష్మారెడ్డి పేరు బ‌య‌టికి రావ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ‌లో ఎన్న‌క‌ల వేళ త‌మ పార్టీ అభ్య‌ర్థి సీబీఐ వివాదంలో వుండ‌టం కాంగ్రెస్ వ‌ర్గాల‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

సీబీఐ డీఐజీ మ‌నీష్‌కుమార్ సిన్హా సుప్రీమ్ కోర్టులో వేసిన పిటీష‌న్‌లో ప‌లు కీల‌క అంశాలు బ‌య‌టికి రావ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మాంసం వ్యాపారి మోయిన్ ఖురేషీ కేసులో కేంద్ర విజిలెన్స్ క‌మీష‌న‌ర్ కేవీ చౌద‌రి ఆయ‌న బంధువు గోరంట్ల ర‌మేష్ కు అనుకూలంగా సానా స‌తీష్‌, ఖురేషీల‌కు స‌హాయ‌ప‌డ్డార‌ని మ‌నీష్ త‌ను స‌మ‌ర్పించిన పిటీష‌న్‌లో ఆరోపించడం స‌ర్వ‌త్రా సంచ‌ల‌నంగా మారింది. సీబీఐ అద‌న‌పు డైరెక్ట‌ర్ రాకేష్ ఆస్థానా సీవీసీ చెప్పిన‌ట్టు న‌డుచుకున్నార‌ని, ఇందుకు గానూ కేంద్ర బొగ్గు, మైనింగ్ శాఖ మంత్రి హ‌రీభాయ్ చౌద‌రికి 2 కోట్ల‌ను అంద‌జేసిన‌ట్లు కిచ్చ‌న్న‌గారి ల‌క్ష్మారెడ్డి, రాకేష్ ఆస్థానాల ఫోన్ సంభాష‌ణ‌ను బ‌ట్టి బ‌య‌ట‌ప‌డింద‌ని షాకిచ్చాడు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పెద్ద‌లు చేజేతులా కేసీఆర్‌కు దొరికిపోయామ‌ని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.