150 సీట్లు సాధ్యమేనా బాబు ?

Friday, March 15th, 2019, 11:24:00 AM IST

ఈసారి ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ఎవరికి వారు గెలుపు తమదేనని చెబుతున్నా ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మాత్రం 150 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ ద్వారా లబ్ది పొందినవారిని 150 సీట్లు గెలిపించమని అడుగుటున్నారు.

ఒక్కసారి వాస్తవంలోకి వచ్చి ఆలోచిస్తే 150 సీట్లు గెలవడమనేది కలలో కూడా జరగని పని. ఎందుకంటే గతంలో బీజేపీ, జనసేనల పొత్తుతో ఎన్నికల్లోకి దిగితేనే టీడీపీ 104 సీట్లు గెలవగలిగారు. అప్పుడు పరిస్థితులన్నీ టీడీపీకి అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. చేసిన కొన్ని తప్పిదాల వలన జనంలో కొంత వ్యతిరేకత మూటగట్టుకుంది.

పైపెచ్చు జనసేన టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పోటీకి సిద్దమైంది. మరోవైపు క్రితంసారి గట్టి పోటీ ఇచ్చిన జగన్ ఈసారి గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకున్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య టీడీపీకి గతంలో వచ్చిన 104 సీట్లు రావడమే కష్టం. అలాంటిది బాబుగారు 150 సీట్లు గెలుస్తామనడం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం తప్ప మరొకటి కాదు.