ఆపరేషన్ ఎన్టీఆర్.. అన్నగారిని గుర్తుచేస్తున్న టీడీపీ !

Monday, February 11th, 2019, 09:14:36 AM IST

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రామారావుగారిని జనానికి గుర్తుచేస్తున్నారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన ఫోటో పెట్టుకుని ఓట్లు రాబట్టుకోవడం అనే సంప్రదాయాన్ని తూచా తప్పకుండా కొనసాగిస్తున్నారు బాబుగారు. కానీ తరాలు మారుతుండటం, జనాల్లో తాతలు నేతులు తాగేవారు అనే మాటలు అవసరంలేదనే అవగాహన రావడంతో పెద్దాయన పేరు కూడా గతంలో పనిచేసినట్టు ఈసారి పనిచేసే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే ఇంతకుముందులా ఎన్నికల ప్రచార సమయంలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తే ప్రయోజనం ఉండదనుకున్న బాబుగారు చాలా నెలల క్రితమే ఆపరేషన్ ఎన్టీఆర్ పనులు మొదలుపెట్టారు.

ఒక్కసారి ఏడాది కాలంగా టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పడిన ట్వీట్లను చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ఎన్టీఆర్ అలవాట్లను, సినిమాల్లో ఆయన ధరించిన పాత్రలను, ఆ పాత్రలు చెప్పిన నీతుల్ని, ఇతరులతో ఆయన ప్రవర్తన తీరును, జనం క్షేమం కోసం ఆయన అవలంబించిన పద్దతుల్ని పదే పదే గుర్తుచేస్తున్నారు. ఇదంతా పెద్దాయన ప్రభను మళ్ళీ గుర్తుచేసి జనాన్ని ఎమోషనల్ గా పార్టీ వైపుకు తిప్పుకోవడమే. ఈ ఎమోషన్ మన సామాజిక వర్గం అనే మూస ధోరణి నుండి ఇప్పుడిప్పుడే బయటికొస్తున్న కొందరి మీద ఆఖరి నిముషంలో అయినా పనిచేసే అవకాశం ఉంది. అందుకే బాబుగారి టీమ్ అన్నగారిని ఆకాశానికెత్తే పనిని శ్రద్దగా చేస్తోంది.