అంటే.. పవన్ చెప్పిన 75 వేల కోట్ల లెక్క కరెక్టే?

Thursday, October 11th, 2018, 11:00:55 AM IST

చంద్రబాబు నాయుడు మాటల్లోని డొల్లతనం మరోసారి రుజువైంది. అయితే ఈసారి అది బాబు ద్వారానే రుజువు కావడం కొసమెరుపు. కొన్ని నెల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల లెక్కలు తేల్చడానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ద్వారా సుమారు 75 వేల కోట్ల రూపాయల నిధులు ఏపీకి అందాల్సి ఉందని అన్నారు.

ఈ మాటలకు ముఖ్యమంత్రితో సహా టీడీపీ నాయకులంతా అసలు కమిటీ వేయడానికి పవన్ ఎవరు, ఆ లెక్కలన్నీ ఒట్టి బూటకం, కేంద్రం చెప్పినట్టే ప్యాకేజీని విడతల వారీగా విడుదల చేస్తోంది, అంతా నిబంధనల ప్రకారమే జరుగుతోంది అంటూ విమర్శలు గుప్పించారు. కానీ నిన్న బాబుగారరు వేసిన ట్వీట్లు చూస్తుంటే ఆనాడు పవన్ చెప్పిన లెక్కలు సరైనవే అనిపిస్తోంది.

నిన్న ట్విటర్ ద్వారా పవన్ ను విమర్శించాలని ట్రై చేసిన చంద్రబాబు పవన్ మోడీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారు. గతంలో కమిటీ వేసి 75 వేల కోట్లు రావాలన్నారు, కానీ ఇప్పుడు ఆ నివేదిక ఊసే ఎత్తడం లేదని అన్నారు. ఒకవేళ పవన్ చెప్పింది తప్పుడు లెక్కే అయ్యుంటే బాబుగారికి ఆ నివేదికను ఎందుకు ప్రస్తావించడంలేదని అడిగి ఉండేవారే కాదు. కానీ అడిగారు కాబట్టి పవన్ మాటల్లో నిజముందని ఆయనే ఒప్పుకున్నట్టు అర్థం చేసుకోవాలి. మరి అప్పుడేమో తప్పని, ఇప్పుడేమో కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్న బాబుగారిని చూస్తుంటే బీజేపీతో దోస్తీలో ఉన్నప్పుడు ఇలాంటి నిజాల్ని తొక్కేయడానికి ఆయనెంతగా ప్రయత్నించారో అవగతమవుతోంది.