ఇకనుండి పెట్రోల్, డీసిల్ ధరలు తగ్గనున్నాయా..?

Thursday, April 12th, 2018, 12:46:31 PM IST

రోజులు గడుస్తున్న కొద్దీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విలక్షణంగా స్పందించింది. వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచవద్దని చమురు కంపెనీలను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ధరలను పెంచకపోవడం వల్ల లీటరు పెట్రోల్, డీజిల్‌కు రూ.1 చొప్పున కలిగే నష్టాన్ని చమురు కంపెనీలు కొన్ని రోజులు భరించాలని కేంద్ర సర్కార్ సూచించినట్లు తెలిపాయి. నాలుగేండ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈ నెల 1న పెట్రోల్ ధర లీటరు రూ.73.73కు పెరిగింది. అలాగే డీజిల్ ధర లీటరు రూ.64.58 పలికింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. దీనికి ప్రధాన కారణం ముడిచమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం, విపరీతంగా పన్నులు విధించడమే. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచొద్దని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని ఆదేశాలు జారీ చేయకుండా కేంద్రం చేసిన తప్పును మాపై తోయడం సమంజసం కాదు అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు వెల్లడించాయి.

చమురు ధరల నియంత్రణలో మోదీ ప్రభుత్వం విఫలం: కాంగ్రెస్

పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నాలుగేండ్లలో ఒక బ్యారెల్ ముడిచమురు ధర 108 డాలర్లు నుంచి 77 డాలర్లకు పడిపోయినా, పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతున్నదని కాంగ్రెస్ నేత చిదంబరం ప్రశ్నించారు. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments