ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి : చంద్రబాబు

Friday, June 15th, 2018, 03:30:07 AM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు బీజేపీ పై తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని అమరావతిలో విభజన అంశాలు, ఏపీ జరిగిన అన్యాయం, అలానే నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించవలసిన అంశాలపై ఆయన నేడు ఒక సమీక్ష చేప్పట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కేంద్రం చేసిన మోసానికి రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారని, ఎంతో విపత్కర పరిస్థితుల్లో విడిపోయిన మన రాష్ట్రంపై చిన్న చూపు చూడడం సరికాదని అన్నారు. పోలవరం తెలుగు ప్రజల సెంటిమెంట్ అని, దేశంలో ప్రాముఖ్యత చూరగొన్న ప్రాజక్టుల్లో అది ఒకటని, దానికి నిధులు లేకపోయినప్పటికి తమ ప్రభుత్వం నిధులిచ్చి పనులు జరిపిస్తోందన్నారు. దానిని జాతీయ ప్రాజక్టుగా గుర్తించినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం చేయడమేమిటని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాబట్టి పోలవరం విషయంలో మన వాడిని కేంద్రానికి గట్టిగా వినిపించాలని, అప్పుడైనా వారికి అర్ధమవుతుందేమో అని అన్నారు. ఓవైపు అమరావతి అభివృద్ధి, మరోవైపు విభజన హామీలు నెరవేర్చడం, ఇంకోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా.

ఇలా అన్ని విషయాల్లో కేంద్రం వారు నమ్మించి మోసం చేశారన్నారు. ఆ తరువాత ప్యాకెజీ పేరుతో అధిక ఫలితాలు వస్తాయని చెప్పి మరోసారి వంచించారు అన్నారు. ఇప్పటివరకు కేంద్ర సహాయం లేకున్నప్పటికీ రాష్ట్రంలో వృద్ధి రేటుని రెండంకెల స్థానానికి అంటే 10 శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. అయినా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించకుండా, లెక్కలు చెప్పడం లేదనే ఒక్క సాకుతో ప్రతి దానికి అడ్డుపడడం బిజెపి నేతలకు సబబుగా లేదన్నారు. ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ మన రాష్ట్రానికి ఇవ్వవలసిన వాటా మాత్రం సక్రమంగా కానీ, సరైన సమయంలో కానీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. మొదటి నుండి రాష్ట్రానికి హోదా విషయంలో నిజమైన గట్టి పోరాటం చేస్తోంది తమ పార్టీయేనని స్పష్టం చేసారు. కాబట్టి ఇకనుండి అయినా మనకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టి పట్టు పట్టాలని, హోదా ఇచ్చేవరకు మన పోరాటం ఆగకూడదని, కాబట్టి కేంద్రం మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చితీరాల్సిందే అని డిమాండ్ చేశారు……

  •  
  •  
  •  
  •  

Comments