229 కోట్లే.. ఎలా ఖర్చు పెట్టాలి మోడీగారు !

Thursday, November 1st, 2018, 10:54:58 AM IST

మోడీ సర్కార్ ఏపీపై ఏ స్థాయిలో వివక్ష చూపుతోందో మరోసారి రుజువైంది. ఇప్పటికే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల్ని ఆపేసి మొండి చేయి చూపించిన కేంద్రం చివరికి కష్టాల్లో ఉన్న తిత్లీ తుఫాన్ బాధితుల విషయంలోనూ తన కక్షను వెళ్లగక్కింది. తుఫాను బాధితులకు తక్షణ సహాయం కోసం 1200 కోట్లు విడుదలచేయాలని చాలా రోజుల క్రితం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.

ఇన్నాళ్లు ఆ మాటను పెడచెవిన పెట్టిన ఢిల్లీ సర్కార్ నిన్న 229 కోట్ల నిధులు ఇస్తున్నామని, బాధితులకు సహాయం చేయండని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నిధుల్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టాలో తెలియక తలలు పట్టుకుంది. తుఫాను దాటికి గురైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఆస్థి నష్టం 3000 కోట్లకు పైగానే జరిగింది. దీనికి పరిహారం కోసం బాబు కేంద్రాన్ని 1200 కోట్లు అడగ్గా కేంద్రం 229 కోట్లు ఇవ్వడం మరీ హాస్యాస్పందంగా ఉంది. దీన్ని చూస్తే ఏదో ఇచ్చామనే మొక్కుబడికి ఇచ్చినట్టుంది తప్ప బాధితుల్ని ఆదుకోవాలన్న చిత్తశుద్ధితో ఇచ్చినట్టు లేదు.

కేంద్రం ప్రదర్శిస్తున్న ఈ తీరు పట్ల టీడీపీ మాత్రమే కాదు ఇతర పార్టీలు కూడ సంతృప్తిగా లేవు. గతంలో కూడ విశాఖలో హుద్‌హుద్‌ తుఫాను నష్టానికి పరిహారంగా 1000 కోట్లు ఇస్తామని చెప్పిన మోడీ కేవలం 650 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న సంగతి తెలిసిందే. అప్పుడైనా ఇస్తామన్న దాంట్లో కనీసం సగమైనా ఇచ్చారు కానీ ఈసారి మాత్రం కనీసం 10 శాతం కూడ ఇవ్వకపోవడం నిజంగా దారుణమనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments