ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధం

Thursday, June 6th, 2013, 11:34:08 AM IST

చాంపియన్స్ ట్రోఫికి రంగం సిద్ధమైంది. 8 దేశాలు తలపడే ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో శుభారంభం చేసేందుకు ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లోనూ గెలిచిన టీమిండియా ఉత్సాహంతో ఉండగా.. పాకిస్థాన్ చేతిలో పరాభవం పాలైన సౌతాఫ్రికా కాస్త తడబాటుతో కనిపిస్తోంది.

ఐపీఎల్ ముగిసిన తర్వాత మళ్లీ 50 ఓవర్ల సందడి మొదలుకానుంది. చివరి సారి జరగనున్న చాంపియన్స్ ట్రోఫీ జూన్ 6 నుంచి ప్రారంభమవనుంది. ఇక ఆరంభ మ్యాచ్ లోనే గ్రూప్ బీ లో ఉన్న సౌతాఫ్రికా, ఇండియా తలపడనున్నాయి. వన్డే చాంపియన్ గా ఉన్న టీమిండియా.. ఇంగ్లండ్ గడ్డపై బలమైన సౌతాఫ్రికాతో ఢీకొనబోతోంది. ఇరుజట్ల బలాబలాలు సమానంగా ఉండడంతో పోరు రసవత్తరంగా మారనుంది.

భారత బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇండియా టాపార్డర్ రాణించగా.. ఆసీస్ తో మ్యాచ్ లో కుప్పకూలింది. ఓపెనర్లు విజయ్ , ధావన్ లు రెండు మ్యాచుల్లోనూ ఫెయిలవగా.. కోహ్లీ ఒక మ్యాచ్ లో సెంచరీతో అదరగొట్టాడు. ఇక మిడిలార్డర్ లో రైనా, ధోనీ, దినేశ్ కార్తీక్ , జడేజాలు బ్యాటింగ్ లో కీలకంగా మారనున్నారు.

మరోవైపు రోహిత్ శర్మకు అవకాశమిచ్చే విషయంలో ధోనీ తర్జన భర్జన పడుతున్నాడు. వరుసగా రెండు సెంచరీలు చేసిన దినేశ్ కార్తీక్.. రోహిత్ శర్మ ప్లేస్ కు ఎసరుపెట్టాడు. రోహిత్ ను ఆడించాలంటే.. కార్తీక్ ను తప్పించాల్సి ఉంటుంది…ఐతే రెండు శతకాలు బాదిన దినేశ్ ను తప్పించే అవకాశమే లేదు. దీంతో ఓపెనర్ విజయ్, ధావన్ లలో ఒకరినైనా తప్పించాలి..ఇందుకు కూడా అవకాశం లేకపోవడంతో తొలి మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరమవడం ఖాయమనిపిస్తోంది.

ఇక బౌలింగ్ విషయంలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ , ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లు తుదిజట్టులో ఉంటారు. ఇప్పటికే ఉమేశ్ 5 వికెట్లు తీసి సత్తా చాటగా…ఇషాంత్ కూడా 3 వికెట్లు పడగొట్టి ఊపుమీదున్నాడు. మరోవైపు ఆసీస్ తో ఆడిన వేదిక పైనే సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడనుండడం భారత్ కు కలిసొచ్చే అంశం.

మరోవైపు సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉంది. డివిలీర్స్, జేపీ డుమినీ, హషీమ్ ఆమ్లా, డెప్లెసిస్ లతో బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక ఐపీఎల్ సంచలన డేవిడ్ మిల్లర్ దక్షిణాఫ్రికా జట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. బౌలింగ్ విభాగంలో డేల్ స్టెయిన్ , మోర్కెల్ బ్రదర్స్ భారత్ కు సవాల్ గా మారనున్నారు.

ఇక ఈ మ్యాచ్ లో కొన్ని కాంబినేషన్లు క్రికెట్ లవర్స్ లో ఆసక్తి రేపుతున్నాయి. ఐపీఎల్ లో బెంగళూరు తరపున ఆడిన డివిలీర్స్.. ఈ మ్యాచ్ లో కోహ్లీకి సవాల్ విసురుతున్నాడు. కోహ్లీ వ్యూహాలను, అతడి బ్యాటింగ్ కదలికలను దగ్గర్నుంచి పసిగట్టిన డివిలీర్స్.. ఈ మ్యాచ్ లో విరాట్ కు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యాడు.

ఏదేమైనా అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గా ఉన్న ఇరుజట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు జరనుంది. లీగ్ కమ్ నాకౌట్ దశలో మ్యాచ్ లు జరగనున్నందున ప్రతీ మ్యాచ్ కీలకంగా మారనుంది.