సెమీస్‌లోకి లంక: భారత్‌తో ఢీ

Tuesday, June 18th, 2013, 11:36:27 AM IST

సెమీఫైనల్ లో భారత్ ను ఎదుర్కొవడానికి శ్రీలంక రెడీ అయ్యింది. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో శ్రీలంక చేతిలో ఆస్ట్రేలియా చిత్తయ్యింది. కెన్నింగ్టన్ ఓవెల్ లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక 254 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 42.3 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తక్కువ ఓవర్ లలో విజయం సాధించాలన్న ఆస్ట్రేలియా ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

29.1 ఓవర్ లో విజయం సాధిస్తే సెమీస్ కు చేరే అవకాశం ఉండేది. వాట్సన్ (5) రెండో ఓవర్ లో పెవిలియన్ చేరాడు. మాక్స్ వెల్ (32) బ్యాట్ ఝులిపించినా ఫలితం లేకపోయింది. ఇతను మలింగ బౌలింగ్ లో వెనుదిరిగాడు. వోగ్స్ (49) పోరాటం వృథా అయ్యింది. 30.2 ఓవర్ లో 9 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలబడింది. మెక్ కే (30), డోహర్టి (15నాటౌట్) చివరలో బ్యాట్ ఝులిపించారు. చివరకు మెక్ కే ను అవుట్ చేయడంతో లంక బెర్త్ ఖరారైంది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 8 వికెట్లకు 253 పరుగులు చేసింది. మహిళ జయవర్ధనే (84 నాటైట్), తిరుమన్నె (57), దిల్షాన్ (34), చాందిమల్ (31) రాణించారు. ఓపెనర్లు పెరీరా (4), సంగక్కర (3) నిరాశపరిచారు.

గత రెండు ట్రోఫీల్లోనూ విజేతగా నిలిచిన ఆసీస్ ఈసారి ఒక్క విజయమూ లేకుండానే టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది.