చంద్ర‌బాబు గెలుపు కోసం చండీయాగం!

Saturday, March 16th, 2019, 11:15:21 AM IST

గెలుపు కోసం పార్టీలు, నాయ‌కులు కొత్త ఎత్తులు వేస్తుంటే వారి అభిమానులు మాత్రం యాగాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని క‌ర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయ‌కులు శుక్ర‌వారం చండీ యాగం చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఈ యాగాన్ని మూడు రోజుల పాటు నిర్వ‌హించిన‌ట్లు తెలిసింది. ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రం సుభీక్షంగా వుండాల‌ని రాజ‌శ్యామ‌ల యాగం చేసి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు ఆయ‌త చండీ యాగం చేసిన కేసీఆర్ అనూహ్య మెజారిటీలో తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మ‌రోసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

అ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన టీడీపీ త‌మ్ముళ్లు చంద్ర‌బాబు గెలుపు కోసం చండీ యాగాన్ని క‌ర్నూలులో జ‌రిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్రం సుభీక్షంగా వుండాల‌ని, మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి రావాల‌ని చండీ యాగం జ‌రిపిన‌ట్లు టీడీపీ నేత‌లు తెలిపారు. గాయ‌త్రీ ఎస్టేట్ విశ్వేశ్వ‌ర‌య్య స‌ర్కిల్ స‌మీపంలో వున్న టీడీపీ కార్యాల‌యంలో ఈ హోమాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్‌, టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు, ఎమ్మెల్సీలు కె.ఈ ప్ర‌భాక‌ర్‌, బీటీ నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు. యాగాలు చేస్తే గెలుస్తారా? య‌జ్ఞాలు చేస్తే కుల రాజ‌కీయాలు భృష్టు ప‌ట్ట‌కుండా ఉంటాయా? ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌ని నాయ‌కుడు మిగిలి ఉంటాడా? ఈ ఎన్నిక‌ల్లో తేలిపోయే త‌రుణం ఆస‌న్న‌మైంది అంటూ ప్ర‌జ‌ల్లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది.