రైతులకు క్షమాపణ చెప్పిన చంద్రబాబు

Tuesday, January 24th, 2017, 08:20:41 AM IST

babu
ఇప్పటికే రాజధాని కోసం, పోలవరం ప్రాజెక్ట్ ల కోసం రైతులనుండి పొలాలను తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రైతులకు కొంతమందికి పరిహారం కూడా అందజేసింది. కొంతమంది తమకు ఇంకా పరిహారం అందలేదని ఇంకెప్పుడు అందుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే కాకుండా వంశధార ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడంతో అక్కడ కొంతమంది రైతులు నిర్వాసితులు అయ్యారు. ఈ నిర్వాసిత రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇంకా చెల్లించలేదు.

దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. వంశధార ప్రాజెక్ట్ నిర్వసితులకు పరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగినందుకు తాను రైతులకు క్షమాపణ చెప్తున్నానని ఆయన పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. వంశధార ప్రాజెక్ట్ విషయంలో రైతులందరితో మాట్లాడి ప్యాకేజీ నిర్ణయించామని… ఆ తర్వాత జీవో కూడా ఇచ్చామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని, దానికి తనకు చాలా బాధగా ఉందని అన్నారు. జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే ఆలస్యమైందని, అందుకు తనను క్షమించాలని, మంగళవారం నుండి బాధితులందరికీ నష్టపరిహారం అందుతుందని ఆయన స్పష్టం చేశారు