అప్పు కోసం రైతు భూములు తాక‌ట్టు!?

Sunday, September 30th, 2018, 11:05:40 AM IST

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల‌పై ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. నిబంధ‌న‌లకు పాత‌రేసి బాబు చేస్తున్న `అధిక‌ వ‌డ్డీల‌కు అప్పు` నిర్వాకంపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్ష పార్టీలు విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. అవ‌స‌రం లేక‌పోయినా ఇదివ‌ర‌కూ 10.5 శాతం వ‌డ్డీకి దాదాపు 2వేల కోట్లు బాండ్ల రూపంలో అప్పు చేసిన ఏపీ ప్ర‌భుత్వం ఇప్పుడు రైతు భూముల్ని బ్యాంకుల‌కు తాక‌ట్టు పెట్టి మ‌రో 10వేల కోట్లు తేవాల‌ని చూస్తోందిట‌.

మొత్తానికి అమ‌రావ‌తి నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూముల్ని వాణిజ్య బ్యాంకుల‌కు తాక‌ట్టు పెట్ట‌డం ద్వారా ఆ డ‌బ్బును అక్క‌డ నిర్మాణాల‌కు వెచ్చించాల‌న్న‌ది ప్ర‌తిపాద‌న‌. అయితే ఇలా వ‌చ్చిన సొమ్ముల్ని నిజాయితీగానే రాజ‌ధాని క‌ట్ట‌డాల‌కు ఖ‌ర్చు చేస్తున్నారా? అంటే ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. అవినీతిలో, అప్పులు చేసి సొమ్ములు మాయం చేయ‌డంలో, కాంట్రాక్టుల పేరుతో అయిన‌వారికి దోచి పెట్ట‌డంలో, రియ‌ల్ వెంచ‌ర్లు వేసి బినామీల‌కు త‌ర‌లించ‌డంలో చంద్ర‌బాబు ఆడుతున్న దొంగాట‌కం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ఈ విష‌యంపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున గోల చేస్తున్నా.. బాబు త‌న ప‌ని తాను చేసుకుపోతూనే ఉన్నారు. మ‌రోవైపు అప్పు తెచ్చి నిర్మాణాలు క‌ట్ట‌క‌పోతే అవ‌న్నీ మ‌ధ్య‌లోనే ఆగిపోయే ప‌రిస్థితి ఉంద‌ని సీఆర్‌డీఏ హెచ్చ‌రిస్తుండ‌డం చూస్తుంటే అస‌లేం జ‌రుగుతోంది? అమ‌రావ‌తి నిర్మాణం స‌వ్యంగా జ‌రుగుతోందా.. లేదా? అన్న సందేహాలు రాజుకుపోతున్నాయి. ఒక‌వేళ అమ‌రావ‌తి విష‌యంలో ఏ తేడా జ‌రిగినా ఎక‌రాల‌కు ఎక‌రాలు భూములిచ్చిన రైతుల ప‌రిస్థితేంటి? అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రోవైపు రాజ‌ధాని అప్పు పేరుతో రాష్ట్రంలోని కోట్లాది మంది ప్ర‌జ‌ల నెత్తిపై ల‌క్ష‌ల్లో అప్పును బ‌నాయించింది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.