వాళ్ళిద్దరు కలిసి ఏం మాట్లాడుకున్నారు..?

Sunday, April 22nd, 2018, 08:48:36 PM IST

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఆదివారం భేటీ అయ్యారు. నిన్న విశాఖ పర్యటన ముగించుకున్న గవర్నర్‌ నేరుగా హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉన్నప్పటికీ పర్యటనలో మార్పులు చేసుకుని రాత్రి పదకొండున్నర గంటలకు రైలులో విజయవాడ చేరుకున్నారు. నగరంలోని గేట్‌ వే హోటల్‌లో బస చేశారు. ఉదయం పదకొండు గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు హోటల్‌కు చేరుకుని గవర్నర్‌తో భేటీ అయ్యారు. సుమారు గంట 40 నిమిషాల పాటు ఇరువురు ఏకాంతంగా చర్చించుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ప్రధాని నరేంద్ర మోదీపై తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా దూషణలకు దిగుతుండడం సరికాదని గవర్నర్‌ వారించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందడం లేదని, రాష్ట్ర విభజన అనంతరం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, నిధుల్లోనూ భారీగా కోత విధిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలో కేంద్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం.. గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి వాటిపై ముఖ్యమంత్రితో చర్చించాలని సూచించి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జరుగుతున్న ఆందోళనలు, స్వయంగా ముఖ్యమంత్రే ధర్మపోరాట దీక్ష పేరిట ఒక రోజంతా నిరసన తెలియజేయడం, ఆనాడు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధిగా తిరుపతి ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ అప్పటి దృశ్యాలను ప్రదర్శించి ఈనెల 30న బహిరంగ సభ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ బహిరంగ సభ గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తామని ప్రకటించిన వాటిలో ప్రాధాన్యంగా 18 అంశాలను పేర్కొంటూ వాటి సాధన కోసం తాము పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నందున ఆ హామీల పరిస్థితులను గవర్నర్‌ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని పేర్కొంటూ ఇటీవల కేరళలో ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. అలాంటి సమావేశం మరింత విస్తృత ప్రాతిపదికగా అమరావతిలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర ఇంటలిజెన్స్‌ పేర్కొంది. ఉత్తరాది- దక్షిణాది రాష్ట్రాలు అనే వ్యత్యాసాలు, ఆందోళనలు, దేశ అంతర్గత భద్రతకు సరికాదని.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటే మేలని గవర్నర్‌ హితవు పలికినట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి రాజధాని పనులకు సంబంధించి టెండర్లు, నిధుల వినియోగ పత్రాలపై భారతీయ జనతా పార్టీ నేతలు తమ సందేహాలు, అనుమానాలను ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించి వెళ్లింది. ఆ బృందం నివేదికలోని అంశాలను గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం పంపి ఉంటుందని భావిస్తున్నారు. ప్రధానిపై విజయవాడలో జరిగిన ధర్మపోరాట దీక్ష సమయంలో సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భాజపా ప్రజాప్రతినిధులకు గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పరిణామాలన్నింటిపైనా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కర్నాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతుందనే ప్రచారాంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా గంట 40 నిమిషాలు సమావేశం జరిగినా భేటీ అజెండా, చర్చనీయాంశాలను బయటకు వెల్లడించేందుకు ప్రభుత్వ వర్గాలు విముఖత చూపాయి. సమావేశ వివరాలపై మీడియా ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పటికీ వివరాలు తెలిపేందుకు నిరాకరించి వెళ్లిపోయారు.

  •  
  •  
  •  
  •  

Comments