నాకే పాలిటిక్స్ నేర్పిస్తారా.. బీజేపీని కడిగిపారేసిన చంద్రబాబు !

Wednesday, March 14th, 2018, 01:15:42 PM IST

సాధారణంగా చంద్రబాబు నవ్వుకుంటనే చాలా నెమ్మదిగా మాట్లాడతారు. అయితే ఆయనకు కోపం వస్తే మైకులు బద్దలవ్వాల్సిందే. ఎలాంటి వారినైనా సరే మాటల తూటాలతో కడిగిపారేస్తారు. చాలా రోజులుగా బీజేపీ వ్యవహారం వల్ల మౌనం పాటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపిక పట్టిన చంద్రబాబూ అలా మాట్లాడేసరికి ఆ వార్త ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. శాసన సభలో చంద్రబాబు బీజేపీ వ్యవహార తీరును అలాగే ప్రత్యేక హోదా విషయంలో ఇంకా తన వ్యక్తిగత రాజకీయాల గురించి చాలా సేపు మాట్లాడారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. గత నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 1995 లో సీఎం అయ్యాను. 9 ఏళ్లు పదవిలో ఉన్నాను. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశాను. ఆ తరువాత పదేళ్లు ప్రతిపక్ష హోదాలో ఉన్నాను. ఇప్పుడు సీఎంగా కొనసాగుతున్నా. ఇన్నేళ్ల రాజకీయ పాలనలో రాష్ట్రం గురించి నాకంటే ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఆర్థిక సంస్కరణల ద్వారా లాభాలు వస్తాయని చెప్పింది నేను. అలాంటి ఆలోచనతో ఉన్న నాకే రాజకీయాలు తెలియదు అంటున్నారు. రాష్ట్రాన్ని సరిగ్గా పాలించలేదని అనవసరంగా లేనిపోని నిందలు వేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడం పెద్ద పని కాదు.

రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడినప్పుడు సహాయం చేయాల్సిన బాధ్యత ఉందని మోడీ ప్రభుత్వం తలచుకుంటే చాలా సులువని తెలిపారు. ఒక కమిటీని ఏర్పరచి ఏ తరహాలో రాష్ట్రానికి ఉపయోగపడితే మేలు అనే విషయాలను తెలుసుకొని రాష్ట్ర విభాజన చట్టంలో ఏ తరహా హామిలిచచ్చాం అనే విషయంలో క్లారిటీకి వస్తే అన్ని పనులు వేగంగా జరిగిపోతాయి. నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలో నేనే సీనియర్ నాయకుడిని. కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ తో చర్చలు జరిపి ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీలను ఒకే వేధికపైకి తెచ్చారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానంగా న్యాయం చేసి ఏపీకి మాత్రం ద్రోహం చేస్తున్నారు. సెంటిమెంట్‌ కారణంగానే తెలంగాణ ఇచ్చారు. ఏపీకి నిధులు రావని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

అదే సెంటిమెంట్‌ను గౌరవించి భారత జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. విభజన చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించారు. అప్పుడు ఆలోచించలేదా అని చంద్రబాబు బీజేపీ నాయకులను ప్రశ్నించారు. అంతే కాకుండా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే.. హోదా ఇవ్వలేము రెవెన్యూ లోటు ఇచ్చేశాం అంటే ఒప్పుకోవాలా? అంటూ.. 60 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు పోతే మీకు బాధగా అనిపించిందా? అని ప్రశ్నించారు. ఇక మోడీ గారు గతంలోనే చాలా సార్లు ఆంధ్రప్రదేశ్ ని ఆదుకుంటామని మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేస్తామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. రాష్ట్రాన్నీ అడ్డగోలుగా విభజించి కాంగ్రెస్ పార్టీ మాయమైంది. ఇప్పుడు ఆ గతి ఎవరికీ పట్టకూడదని కోరుకుంటున్నా అని చంద్రబాబు వివరించారు.