చంద్రబాబు బాహుబలి, ఆయనే భళ్లాలదేవ : టీడీపీ ఎమ్యెల్సీ రాజేంద్రప్రసాద్

Tuesday, April 17th, 2018, 11:05:50 PM IST


ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శలకు టిడిపి నేతల్లో కొంతమంది గట్టిగానే బదులు సమాధానం ఇస్తుంటారు. అందులో గట్టిగా తన ప్రతిస్పందన తెలియచేయడంలో దిట్ట ఎమ్యెల్సీ రాజేంద్ర ప్రసాద్. ఆయన మంచి వాక్పటిమ గల నేత అనే విషయం అందరికి తెలిసిందే. ఇటీవల టాలీవుడ్ లో హీరోలు కేవలం సినిమాల్లోనే నటిస్తారా, ప్రత్యేక హోదాకోసం తాము పోరాడుతుంటే వారు ఎందుకు ముందుకురారు అని ప్రశ్నించారు కూడా. అయితే ఆయనవ్యాఖ్యలపై టాలీవుడ్ పెద్దలు కొందరు ఘాటుగా సమాధానం ఇవ్వడంతో, కొంత తగ్గిన ఆయన తరువాత టాలీవుడ్ నటులకు క్షమాపణ చెప్పిన విషయం విదితమే. అయితే నేడు ఆయన కొన్ని చంద్రబాబు, మోడీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ‘బాహుబలి’గా, మోదీని ‘భల్లాలదేవుడు’గా ఆయన అభివర్ణించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై ఎన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతామని, తమ డిమాండ్లు, ఆందోళనలపై మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో భాగం కాదా అని మోదీని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై ఆయన విమర్శలు చేశారు. ఈ పాదయాత్రకు ప్రజల ఆదరణ కరువైందని, తన సభలకు జనాలు రాకపోవడంతో పార్టీ నేతలకు జగన్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, టీడీపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, మునిగిపోయే పార్టీలో ఎవరుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఏపీలో ప్రత్యేక హోదా అంటూ పోరాటాలు కేంద్ర ప్రభుత్వంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామని అన్నారు. వైసీపీ నాయకులు తిరుపతిలో ఓ పాత బైక్ ను కొని తగులబెట్టి అల్లర్లకు పాల్పడాలని ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. ఢిల్లీలో కాళ్ల బేరాలాడుతున్న వైసీపీ నేతలు, ఏపీలో మాత్రం ప్రత్యేక హోదా అంటూ పోరాటాలు చేస్తున్నారని, వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. మోదీ, జగన్ కలిసి కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరని, మోదీని ప్రశ్నించే దమ్ము జగన్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు…..