మా వల్లనే చంద్రబాబు సిఎం అయ్యారు : బిజెపి నేత

Monday, March 19th, 2018, 09:23:49 PM IST

మొదటినుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీలు విషయమై కేంద్ర బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని టిడిపి నేతలు, నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మొన్న ఎన్డీయే ప్రవేశ పెట్టిన ఆఖరి బడ్జెట్ లో కూడా ఆంధ్రా కు సరైన కేటాయింపులు జరగకపోవడంతో టిడిపి సహా అన్ని పార్టీలు బిజెపి పై నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ప్రత్యేక హోదా ఒప్పుకుని దాన్ని ప్రత్యేక ప్యాకెజీ గా మార్చారు. దానివల్ల రాష్ట్రానికి మేలుజరుతుందనే ఒప్పుకున్నామని చంద్రబాబు చాలా సార్లు చెప్పారు.

అయితే ఇప్పటివరకు మాత్రం రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సరైన రీతిలో కేంద్రం స్పందించక పోవడంతో టిడిపి, బీజేపీ పై మాటల యుద్ధం పెంచింది. ప్రస్తుతం టిడిపి, వైసిపి బీజేపీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నిర్ణయించాయంటే, విషయం ఏ స్థాయి వరకు వెళ్లిందో చేసుకోవచ్చు. టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని ఆంధ్ర బిజెపి సభ్యులు పలుమార్లు మండిపడ్డారు. అయితే ఇప్పుడు వారి మాటల దూకుడు మరింత పెరిగింది. దీనిపై బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మీడియా తో మాట్లాడారు.

ఆదివారం విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మిత్రపక్షం కాబట్టే టిడిపి విషయంలో ఇంతకాలం సంయమనంతో వ్యవహరించామని, ఇకపై ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలు తన వల్లే బయటకు వచ్చాయని, సిట్‌ ఏర్పాటుకు ప్రధాన కారణం తానేనన్నారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీయే ప్రతిపక్ష పాత్రను పోషిస్తోందని చెప్పారు. టీడీపీ నాయకుల అవినీతి పెరిగిపోయిందని, ఇసుక మాఫియాలు దోచుకుంటున్నాయని ఆరోపించారు.

అసలు ఆంధ్ర లో బీజేపీ, పవన్‌కల్యాణ్‌ అండతోనే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందని, లేకపోతే జగన్‌ సీఎం అయి, చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చునేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఈ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. మొదట్లో ఒకలా తరువాత మరోలా మాట్లాడడం తమ పార్టీ నేతలకు అలవాటు లేదని, అది టీడీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు అందరికంటే తెలివిగలవారని, వాళ్లకు అంతాతెలుసునని అన్నారు….