చంద్రబాబు సీఎం పదవికి అనర్హులు : వైఎస్ జగన్

Thursday, May 10th, 2018, 09:53:18 AM IST

ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్ టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వ లోపాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వెళుతున్నారు. ఆయన యాత్రలో పలువురు ఉద్యోగులు, టీచర్లు, దళితులు, అంగన్వాడీ కార్యకర్తలు తమ కష్టాలను జగన్ కు వివరిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ గృహకల్పలో లోపాలు విన్న జగన్, రోపాయి ఖర్చు లేకుండా పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. అలానే అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదానికంటే ఎక్కువ జీతం ఇస్తామన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సమస్యగా మరీనా ఉపాధ్యాయుల కాంటెంపరరీ పెన్షన్ విధానం పైకూడా స్పందించిన జగన్ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పద్దతిని అమల్లోకి తెస్తామన్నారు.

కాగా యాత్రలో భాగంగా కృష్ణ జిల్లా పెరికగూడెంలో ‘దళిత ఆత్మేయ సమ్మేళనం’ లో ప్రసంగించిన జగన్ మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతున్నపుడే బాబుకు ప్రజలు గుర్తుకువస్తారని, అప్పుడు మాత్రమే వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆయనకు అనిపిస్తుందని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో దళితులపట్ల వివక్ష చాల పెరిగిపోయిందని, స్వతంత్రం వచ్చి 70ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ దళితులు పోరాటాలు చేయవలసిన పరిస్థితులు వున్నాయి అన్నారు. యధా రాజా, తధా ప్రజా అన్నరీతిలో ముఖ్యమంత్రి గారి బాటలోనే ఆయన పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా నడుస్తున్నారన్నారు. ఎస్టీలకు తెలివిలేదని, దళితుడిగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన అనుచరులు ఆదర్శంగా తీసుకుని దళితులపై దాడులకు పాల్పడుతున్నారు అన్నారు.

దళితులు శుభ్రంగా ఉండరని, సరిగ్గా స్నానం కూడా చేయరని ఇటీవల టీడీపీ మంత్రి ఆదినారాయణ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. తన క్యాబినెట్ లో మంత్రి ఈ విధంగా వ్యాఖ్యలు చేసివుంటే అతన్ని ఎప్పుడో క్యాబినెట్ నుండి తొలగించి వుండేవాడినన్నారు. పేదవాళ్ళను ప్రేమగా పలకరించలేని చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో, ఆ పదవిలో కొనసాగడానికి ఏ మాత్రం అర్హుడుకాదని అన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయితే దళితులు సహా పేదవారందరి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేలా చేస్తారని మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో టీడీపీ దళితులకు చేసినదేమిటో చెప్పాలని, కారంచేడు నుండి పెందుర్తి ఘటనవరకు టిడిపి హయాంలో దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉందన్నారు……