ఆ న‌లుగురికి ఓట‌మి భ‌యం వెంటాడుతోందా?

Saturday, May 18th, 2019, 09:08:49 AM IST

ఏపీ ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌తి ప‌క్ష వైసీపీలో ఆనందం..అధికార టీడీపీలో ఆందోళ‌న మొద‌లైంది. అయినా గెలిచేది మేమే అంటూ టీడీపీ ఎంత మేక‌పోతు గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించినా టీడీపీ శ్రేణుల్లో మాత్రం భ‌యం మొద‌లైంది. ఎందుకు ఓడిపోతున్నాం అనే అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. ఇక పార్టీలో అత్య‌ధిక శాతం సీనియ‌ర్లు, మంత్రులే ఓట‌మి పాలౌతార‌న్న విష‌యం బ‌య‌టికి రావ‌డంతో టీడీపీ అధినేతలో క‌ల‌వ‌రం మొదలైంద‌ట‌. ఎమ్మెల్యేల్లో కొంత మంది ఓట‌మి చ‌విచూస్తార‌నుకున్నామే కానీ ఏకంగా మంత్రుల్లో కీల‌క వ్య‌క్తులు ఓట‌మి చెందుతార‌ని ప‌లు స‌ర్వేలు తేల్చ‌డంతో చంద్ర‌బాబు నాయుడుకు ఏం చేయాలో తెలియ‌డం లేద‌ట‌.

అందులోనూ త‌న‌కు అత్యంత స‌న్నిహితంగా మెలిగే దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, త‌న‌యుడు లోకేష్‌, గంటా శ్రీ‌నివాస‌రావు, అచ్చం నాయుడు ఖ‌చ్చ‌తంగా ఓట‌మి పాలౌతార‌ని స‌ర్వేలు బ‌లంగా లేల్చి చెప్ప‌డం టీడీపీ అధినేత‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంద‌ట‌. ఇరిగేష‌న్ మినిస్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న దేవినేని ఉమ గ‌డిచిన ఐదేళ్లలో భారీ స్థాయిలో అవినీతికి పాల్ప‌డ్డార‌ని, అందిన‌కాడికి నొక్కేశార‌ని ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తోంది. ఇత‌నిపై వైసీపీ అభ్య‌ర్థి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేసి గ‌ట్టి ప‌టీ నిచ్చారు. ఉమ‌తో పోలిస్తే ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థివైపే ఓటర్లు మొగ్గిన‌ట్లు తెలుస్తోంది. ఇక మంగ‌ళ‌గిరి విష‌యానికి వ‌స్తే ఐటీ మంత్రిగా ప‌నిచేసిన నారా లోకేష్‌దీ ఇదే ప‌రిస్థితి. అక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి బ‌రిలో నిలిచారు. లోకేష్ ప్ర‌సంగాలు, అత‌ని వెకిలి చేష్ట‌లే కొంప‌ముంచబోతున్నాయ‌ని వినిపిస్తోంది.

ఇక మ‌రో మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుదీ ఇదే ప‌రిస్థితి. సొంత అభ‌వృద్ధి, నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌ని ప‌ట్టించుకోక‌పోవ‌డం, రాజ‌ధాని పేరుతో జ‌రిగిన డ్రామా స‌మాయంలో వంద‌లాది ఎక‌రాల‌ని క‌బ్జా చేశార‌ని ఆయ‌న‌పై చాలా అభియోగాలున్నాయి. ఇవ‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలుసు. అందుకే ఈ ద‌ఫా అత‌నికి చెక్ పెట్టి ఓడించ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన అచ్చం నాయుడు ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. నిత్యం వైసీపీ వ‌ర్గాల‌పై విరుచుకుప‌డే అచ్చం నాయుడు క్షేత్ర స్థాయిలో త‌న‌పై వ్య‌తిక‌రేక‌త వుంద‌ని గుర్తించి చాలా రోజులుగా సైలెంట్ అయిపోయారు. ఈ న‌లుగురు ఓడిపోతార‌న్న చేదు నిజం బాబుకు నిద్ర ప‌ట్ట‌నివ్వ‌డం లేద‌ట‌. వీరే కాకుండా మ‌రికొంద‌రు మంత్రులు కూడా దారుణంగా ఓడిపోయే ప్ర‌మాదం వుంద‌ని స‌ర్వేలు తేల్చ‌డంతో టీడీపీ వ‌ర్గాల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.