మోడీపై బాబు దీక్షాగ్రహం: దయా దాక్షిణ్యాలు అక్కర్లేదు – మీ ఆటలు సాగవు..!

Monday, February 11th, 2019, 10:34:34 AM IST

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు, ఈ దీక్ష ఉదయం 8గంటల నుండి రాత్రి 8గంటల వరకు సాగనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఢిల్లీలోని ఏపీ భవన్ దగ్గర దీక్ష చేసిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణానికి కేంద్రం సహాయ నిరాకరణ వంటి అంశాలపై నిరసనగా చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు పర్యటన భాగంగా చంద్రబాబుపై మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు, మోడీ పర్యటనకు ముందు నుండే రాష్ట్రంలో టీడీపీ తరఫున నిరసన జ్వాలలు మిన్నంటాయి. మోడీ పర్యటనపై చంద్రబాబు కూడా ఒక రేంజ్ లో ధ్వజమెత్తారు. ధర్మపోరాట దీక్షలో కూడా మోడీపై బాబు నిప్పులు చెరిగారు.

న్యాయం చేయమంటే వ్యక్తిగత విమర్శలు చేస్తారా?, మా హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదు, ఖబడ్ధార్ ప్రధాన మంత్రి మీ ఆటలిక సాగవు అంటూ చంద్రబాబు ఉగ్రరూపం దాల్చారు. పోలవరం విషయంలో అన్యాయం చేసారు, ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామని ఇప్పుడు మాట మార్చారు అంటూ మోడీపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజధాని నిర్మాణానికి 1500కోట్లు ఇచ్చారు, భిక్షమేసినట్లు వేస్తె రాజధాని ఎలా నిర్మించుకుంటాం? అని ప్రశ్నించారు. మా సత్తా చూపేందుకే ఢిల్లీ వచ్చాం, ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తే ఊరుకునేది లేదు, మీ ఆటలిక సాగవు అంటూ హెచ్చరించారు.