టి-టీడీపీ నేత‌లు .. పిలిచి వాత‌లు పెట్టించుకున్నారు!

Saturday, November 5th, 2016, 11:22:17 PM IST

tdp
ఏపీలో జ‌న‌చైత‌న్య యాత్ర‌లు పేరుతో ప‌సుపు చొక్కాలు బోలెడంత హంగామా చేశాయి. ప్ర‌జ‌లకు మేము సైతం అంటూ బోలెడ‌న్ని క‌బుర్లు చెప్పారు తేదేపా నేత‌లు. ఏదైతేనేం అది స‌క్సెస్సే. అదే హుషారులో తెలంగాణ‌లోనూ జ‌న‌చైత‌న్య యాత్ర‌లు ప్రారంభించినా .. ఇక్క‌డ తూతూగానే న‌డిపించేశార‌న్న టాక్ ఉంది. ఆరంభ సూర‌త్వం త‌ప్ప జ‌నాల్లోకి వెళ్లిందే లేదు.. తెలంగాణ గ‌డ్డ‌పై పార్టీ జ‌వ‌స‌త్వాలు ఉడిగి నీర‌స‌ప‌డిపోయింద‌న్న భావ‌న‌లో టి-టీడీపీ నేత‌లు లైట్ తీస్కున్నారు.

అయితే పిల్లి పాలు తాగుతూ త‌మ‌ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదనుకున్న చందంగా పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఇదేమీ ప‌ట్టించుకోర‌ని భావించిన‌ట్టున్నారు ఇక్క‌డి నేత‌లు. మొన్న‌టి తెలంగాణ తేదేపా స‌మీక్ష స‌మావేశంలో .. బోలెడ‌న్ని విష‌యాలు చ‌ర్చ‌కొచ్చాయి. ఈ చ‌ర్చ‌ల్లో ముఖ్యంగా కొత్త జిల్లాల‌కు పార్టీ క‌న్వీన‌ర్ల‌ను నియ‌మించి .. లోతుగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అలాగే కొంద‌రు నేత‌లు ఏపీ త‌ర‌హాలో జ‌న‌చైత‌న్య యాత్ర‌లు తెలంగాణ‌లోనూ చేప‌ట్టాల‌ని, స్పీడ‌ప్ చేయాల‌ని అత్యుత్సాహంగా బాబుకు స‌ల‌హా ఇవ్వ‌జూస్తే మూతి కాలే రిప్ల‌య్‌ అట్నుంచి వ‌చ్చింది.

ఇక్క‌డా మొద‌లెట్టి గాలికొదిలేశారు. చేసే ప‌నిలో చిత్త‌శుద్ధి లేకుండా చేశారు.. అంటూ బాబు క్లాస్ తీస్కున్నారుట‌. ప్రారంభోత్స‌వాలు ఘ‌నం.. త‌ర్వాత మాత్రం గాలికొదిలేస్తారా? అన్నీ చూస్తున్నా అంటూ బాబు హుంక‌రించారుట‌. దీంతో మ‌నోళ్ల‌కు అర్థ‌మైంది.. ప‌ట్టించుకోన‌ట్టే ఉన్నా దిమాకున్నోడు దునియా మొత్తం చూసిన‌ట్టు బాబు కూడా ఇటువైపే క‌ళ్లేసి చూస్తున్నాడ‌ని తెలిసొచ్చింది టి-టీడీపీ నేత‌ల‌కు. పిలిపించుకుని వాత‌లు పెట్టించుకోవ‌డం అంటే ఇదే క‌దూ?