చంద్రబాబు, జగన్, పవన్…..ఎవరి బలమెంత?

Wednesday, June 13th, 2018, 08:49:15 AM IST

2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు రోజుకోరకంగా మారుతున్నాయి. ఓవైపు చంద్రబాబు నవనిర్మాణ దీక్షలు చేపడుతుంటే, మరోవైపు జగన్ ప్రజాసంకల్ప యాత్ర, ఇంకోవైపు జనసేన అధినేత పవన్ ప్రజా పోరాట యాత్రలు చేపడుతూ ప్రజలకు చేరువవుతున్నారు. అయితే రానున్న ఎన్నికలు ఒకింత రసవత్తరంగా సాగుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి పరిస్థితులు వేరని, అప్పటి పరిస్థితులతో ఇప్పటికి పోల్చి చూడలేమని అంటున్నారు. ప్రజలు సినీతారలను అమితంగా అభిమానిస్తారని, అయితే ఎన్నికలవేళ మాత్రం ఆలోచించి ఓటేస్తారని చెప్తున్నారు. ఇక మూడు పార్టీల అధినేతలు ఒకరకంగా ప్రస్తుతం ప్రజల్లో మంచి అభిమానాన్ని చూరగొన్నారు అని చెప్పాలి. ఎన్నోయేళ్ల నుండి అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేలా అన్న నందమూరి తారకరామారావు గారు టీడీపీని నెలకొల్పి అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు.

కాగా అప్పటినుండి టీడీపీకి కొంత ఎప్పటికి చెక్కుచెదరని కోటరీ ఉందని, అందువలన టీడీపీని తక్కువ అంచనా వేయకుడదని, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మంచి అనుభవశాలి కాబట్టి ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో తెలుసునని ఆయన్ని తక్కువ అంచనావేయకూడని అంటున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చినప్పటికీ ప్రత్యేక హోదా, విభజన హామీల విషయమై కేంద్రంతో టిడిపి సరిగా పోరాడలేదని అందువల్ల ఆ పార్టీపై కొంత మేర వ్యతిరేకత లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గత ఎన్నికల్లో పరాజయం పాలైన వైసిపి పరిస్థితి గతంతో పోలిస్తే కొంతవరకు మెరుగు పడినట్లు చెపుతున్నారు. ఇదివరకు కేవలం అధికారపక్షాన్ని మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు చేసే జగన్, ప్రస్తుతం ప్రజాసమస్యల పై అవగాహనా పెంచుకుని ప్రాంతాల వారీగా వారి అవసరాలు తెలుసుకుంటూ యాత్ర చేపడుతున్నట్లు సమాచారం. ఇక ఆయన చేస్తున్న యాత్రకు జనం నుండి కూడా విపరీతమైన స్పందన రావడం, అందునా యాత్ర మొదలెట్టాక కొందరు ఇతర పార్టీ నేతలు వైసిపి లో చేరడం కూడా శుభపరిణామని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలపై కూడా ఆ పార్టీ మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

అలానే ప్రాంతాలవారీగా నేతలు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి జగన్ లోటుపాట్లు తెలుసుకుంటున్నారని సమాచారం. చివరిగా జనసేన అధినేత పవన్ ప్రస్తుతం ప్రజా పోరాట యాత్ర చేపడుతున్నారు. ఆయన యాత్రకు కూడా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే సభలు, సమావేశాలకు వచ్చే జనంలో ఎంతమేరకు ఓటుబ్యాంకుగా మారుతారు అనేది చెప్పడం కష్టమే అనేది ఒప్పుకోవాల్సిన అంశం. ఇకపోతే ఆయన కూడా ప్రజల్లోకి వెళుతూ, ముందు ప్రజాసమస్యలపై అవగాహనా చేసుకోవాలని, అప్పుడే రానున్న రోజుల్లో తదనుగుణంగా తాము సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలమని యాత్రలో చెపుతున్నారు. అయితే జనసేనకు ఇప్పటివరకు పోటీ చేసే ఆయా నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఎవరెవారిని ఎంచుకుంటారు అనేదానిపై కూడా గెలుపోటములు ఆధారపడి వుంటాయని విశ్లేషకులు అంటున్నారు. ఇక పవన్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే దానిపై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదని, ఆయన ముందు పార్టీ కార్యవర్గం, అభ్యర్థుల ఎంపిక సరైన రీతిలో చేపడితే ఆయనకు కూడా ప్రజలు మొగ్గుచూపే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ త్రిముఖ పోటీని బట్టి చూస్తే ఈ సారి కూడా ఏపీలో ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగనున్నాయని చెప్పకతప్పదు….

  •  
  •  
  •  
  •  

Comments