చంద్రబాబు జోస్యం: తాజ్ మహల్ తర్వాత ఏపీ అసెంబ్లీయే..!

Sunday, January 13th, 2019, 12:08:01 AM IST

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శైలిలో ఫ్యూచర్ గురించి వ్యాఖ్యలు చేసారు. దేశంలో తాజ్ మహల్ తర్వాత ఏపీ అసెంబ్లీ గురించే మాట్లాడుకుంటారని అన్నారు, విజయవాడలో ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సందర్బంగా ప్రసంగించిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర రాజధాని అమరావతిని సుందర నగరంగా తీర్చిదిద్దబోతున్నాం అని అన్నారు. అమరావతిలో ఎక్కడ చేసినా పచ్చదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకొని నిర్మించబోతున్నాం అని అన్నారు, అందువల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టానని, ఒక కొత్త నగరాన్ని నిర్మించి సైబరాబాద్ గా దానికి నామకరణం చేసిన ఘనత తనకే దక్కుతుందని అన్నారు.

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వేగవంతంగా అమరావతిలో పనులు జరుగుతున్నాయని అన్నారు, అప్పట్లో రాజధానికి పెట్టుబడులే రావని, వచ్చినా ప్రణాళికాబద్ధంగా వాటిని వాడుకోవడంలో విఫలమవుతామని విమర్శించారని అన్నారు. వారందరికీ గట్టి సమాధానం చెప్పేలా అమరావతి అభివృద్ధి చెందబోతోందని అన్నారు, ఎవరెన్ని విమర్శలు చేసినా తాను అభివృద్దే లక్ష్యంగా పనిచేశానని అన్నారు. 40వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలోనే అమరావతి సుందర నగరంగా రూపుదాల్చనుందని చంద్రబాబు అన్నారు.